ఏపీపై కన్నేసిన కేసీఆర్.. సంక్రాంతికి భారీ బహిరంగ సభ?

by Disha Web Desk |
ఏపీపై కన్నేసిన కేసీఆర్.. సంక్రాంతికి భారీ బహిరంగ సభ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రతిపాదించిన బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్ ఏపీ విషయంలోనూ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు ఏపీలో ఆదరణ లభిస్తుందనే అంచనాలతో కేసీఆర్ ఉన్నారని టీఆర్ఎస్ నేతల చెబుతున్నారు. ఏపీకి చెందిన పలువురు నేతలతో ఇప్పటికే కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వచ్చే సంక్రాంతికి ఏపీలో భారీ స్థాయిలో బహిరంగ సభను నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారనే ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆ రెండింటిలో ఓ చోట కేసీఆర్ సభ?:

గుంటూరు లేదా విజయవాడ ఈ రెండింటిలో ఒక చోట వచ్చే జనవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. గతంలో కలిసి పని చేసిన కారణంగా ఏపీ టీడీపీ నేతలతో కేసీఆర్ కు మంచి పరిచయాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. వీరి మద్దతుతో ఏపీలో బీఆర్ఎస్ కు లంగర్ వేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇన్ యాక్టివ్ గా ఉన్న నేతలు, ఆశావాహులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతూ తాను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ కు ఏపీలో కొంత వరకు అభిమానులు ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ అనౌన్స్ మెంట్ ను పురస్కరించుకుని విజయవాడలో కేసీఆర్ కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలవడం చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశాలన్నింటిని పరిణలోకి తీసుకున్న కేసీఆర్ భారీ బహిరంగ సభ ద్వారా ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ను పరుగులు పెట్టించే ప్లాన్ చేస్తున్నారట. అయితే అక్టోబర్ 25న విజయవాడ కేంద్రంగా సీపీఐ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. ఈ సభకు కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. మరి ఈ సభకు ఆయన హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

కలిసిసేదెవరు? నిలిచేదెవరు?:

జాతీయ రాజకీయాలే టార్గెట్ గా బీఆర్ఎస్ ను ప్రకటించిన కేసీఆర్ కు ఏపీలో వ్యవహారం అంత సులువు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కేసీఆరే ప్రధాన కారణం అనే ఆగ్రహం ఏపీ ప్రజల్లో ఉంది. హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాక అక్కడి నుంచి తమను పంపించివేశారనే ఆవేదన ఏపీ ప్రజల్లో ఇప్పటికీ వ్యక్తం అవుతూనే ఉంటుంది. ఆదాయం సమకూర్చే హైదరాబాద్ లేకపోవడంతో ఏపీకి అప్పులు తప్పా దమ్మిడి ఆదాయం లేకుండా పోయిందనే విషయాన్ని రాజకీయ పార్టీలు సైతం పదే పదే ప్రస్తావిస్తున్నాయి. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరో వైపు వైసీపీ నేతలతో టీఆర్ఎస్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ప్రతిపాదించిన బీఆర్ఎస్ కు ఏపీలో ఏ మేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నగా మారింది. అసలు కేసీఆర్ తో కలిసి వచ్చేదెవరు వచ్చినా చివరి వరకు నిలిచేదెవరు అనేది భవిష్యత్ లో తేలాల్సిన అంశం.


Next Story

Most Viewed