బిగ్ న్యూస్: MLC కవితకు మళ్లీ నోటీసులు.. ఏ క్షణమైనా ఈడీ నుంచి పిలుపు..?

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: MLC కవితకు మళ్లీ నోటీసులు.. ఏ క్షణమైనా ఈడీ నుంచి పిలుపు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ నోటీసుల నుంచి ఉపశమనం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించినా సానుకూల ఫలితం రాకపోవడంతో ఇకపై ఏం జరగనున్నదనే ఆసక్తి బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొన్నది. ఈ నెల 21న విచారణకు హాజరైన కవితకు మరోసారి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసిన ఈడీ.. మెయిల్ ద్వారా తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. తాజాగా సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ అనంతరం నోటీసుల జారీకి ధర్మాసనం ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో ఆమెను మరో సారి ఈడీ పిలివడం ఖాయమనే సంకేతాన్ని ఇచ్చినట్టయింది.

సుప్రీంకోర్టులో ఈ నెల 14న పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా ఈడీ నుంచి కవితకు రెండుసార్లు నోటీసులు వచ్చాయి. సుప్రీంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ఆమెకు ఉపశమనం కలిగించలేకపోయింది. క్రమం తప్పకుండా ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. పిటిషన్‌లో చేసిన ప్రేయర్‌కు ఇప్పుడు స్థానం లేదని, అది కాలం చెల్లినదేనంటూ సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఈడీ వ్యాఖ్యానించింది.

దీంతో ఇకపైన నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు ఈడీ సంకేతమిచ్చినట్లయింది. తదుపరి విచారణ మూడు వారాల తర్వాత జరపనున్నట్టు సుప్రీం తెలిపినా.. అప్పటివరకూ నోటీసుల జారీకి సంబంధించి ఈడీకి కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అదే సమయంలో ఎంక్వయిరీకి హాజరుకావడంపై కూడా కవితకు ఎలాంటి రిలీఫ్‌ ఇవ్వలేదు. దీంతో నోటీసులు ఎప్పుడైనా రావొచ్చనే చర్చలు బీఆర్ఎస్ వర్గాల్లో జరుగతున్నాయి.

లీగల్ ఒపీనియన్లతోనే ‘సుప్రీం’కు

ఈడీ నుంచి ఎదురవుతున్న చిక్కుల నుంచి ఉపశమనం పొందడానికి లీగల్ నిపుణుల నుంచి తీసుకున్న సలహాల మేరకే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిలీఫ్ వస్తుందని భావించినా అది కుదరలేదు. ఇకపైన నోటీసులు వస్తే ఏం చేయాలన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థలలో పనిచేసిన, అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారుల నుంచి సైతం ఇటీవల కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఎలాంటి వాదనలను లేవనెత్తాలన్నదానిపై సుదీర్ఘ కసరత్తు జరిగినా కవిత తరఫున వాదించిన కపిల్ సిబల్ మాత్రం కేవలం మహిళా కోణం నుంచి ఇంటి దగ్గర విచారించలన్న అంశానికి మాత్రమే పరిమితమయ్యారు.

పిటిషన్‌లో ఆమె చేసిన రిలీఫ్ అంశం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. రిటైర్డ్ అధికారులు, రిటైర్డ్ జడ్జీల నుంచి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను తీసుకున్నా సుప్రీంకోర్టులో ఆశించిన తీరులో రిలీఫ్ రాకపోవడంతో ఇకపైన ఏం చేయాలన్నది కేసీఆర్ ఫ్యామిలీకి సంకటంగా మారింది. మనీ లాండరింగ్ చట్టానికి విస్తృతాధికారాలున్నాయంటూ గతేడాది ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టంగా చెప్పిందనే విషయాన్ని సొలిసిటర్ జనరల్ గుర్తుచేశారు. దీంతో పాటు సమన్లు ఇవ్వడానికి, అరెస్టు చేయడానికి, సోదాలు జరపడానికి ఎలాంటి ఆంక్షలు లేవని నొక్కిచెప్పారు. ఈ రెండు కామెంట్లను చేయడం వెనక ఇకపై ఈడీ తలపెట్టనున్న కార్యాచరణను పరోక్షంగా చెప్పినట్టయిందనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది.

విచారణకు వెళ్లకుండా ప్రత్యామ్నాయమేంటి?

సుప్రీంకోర్టులో ఈడీ వాదనలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు.. కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోమారు సమన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విచారణకు హాజరుకాకుండా రిలీఫ్ పొందడానికి ఏకైక మార్గం సుప్రీంకోర్టు అని భావించినా, చివరకు అక్కడ కూడా ప్రతికూల ఫలితమే రావడంతో ఇతర మార్గాల కోసం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అన్వేషణ మొదలైంది. హాజరు కాకుండా వాయిదాలతో సరిపెడితే ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందనే అనుమానం వెంటాడుతున్నది.

మరోవైపు విచారణకు హాజరైన తర్వాత ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. లిక్కర్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు కవితను, కేసీఆర్ కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఒకవేళ ఈడీ నుంచి నోటీసులు అందినా ప్రత్యేక కారణాలను చూపుతూ వాయిదాలతో తాత్కాలిక ఉపశమనం పొందడమే తప్ప ఏదో ఒక రోజు హాజరుకావాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దాదాపు నెల రోజులుగా కవిత వ్యవహారం కేసీఆర్‌ను ఇబ్బందికి గురిచేస్తున్నదని ఆయన సన్నహితులే చెబుతున్నారు. ఎంక్వయిరీ ఉన్నప్పడుల్లా వీలైనంత ఎక్కువ మంది మంత్రులు ఢిల్లీలోనే ఉండాలని గులాబీ బాస్ సూచించినట్టు తెలిసింది.

నళినీ చిదంబరం పిటిషన్ అటాచ్

సుప్రీంకోర్టు విచారణ తర్వాత కూడా స్పష్టమైన రిలీఫ్ రాకపోవడంతో ఇకపైన జరగబోయే పరిణామాలపైనే కేసీఆర్ మనసంతా కేంద్రకృతమైందని సమాచారం. ఇకపైన ఈడీ నోటీసులిచ్చి ఎంక్వయిరీకి పిలిస్తే మళ్లీ మంత్రులంతా ఢిల్లీ బాట పట్టే అవకాశమున్నది. నోటీసులు, విచారణ ఒక అంశమైతే అరెస్టు చేయడానికి ఈడీ వెనకాబడబోదనేదే పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తున్నది.

నళినీ చిదంబరం పిటిషన్‌తో కవిత అప్లికేషన్‌ను జోడించినందున మూడు వారాల్లోపు ఈడీ ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్‌గాంధీ అనర్హత విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు.. ఈడీ ఎంక్వయిరీ పేరుతో కవితకు ఎలాంటి చిక్కులు ఉంటాయనేది గులాబీ నేతలను ఆందోళన పరుస్తున్నది.

Read more:

డైరెక్టర్ ఆఫ్ ‘పాలిటిక్స్’.. కొత్తగూడెంలో కంటిన్యూగా పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న డీహెచ్!



Next Story

Most Viewed