బీమా సంస్థలో చెట్లు మాయం..?

by Disha Web Desk 12 |
బీమా సంస్థలో చెట్లు మాయం..?
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జీవిత బీమా సంస్థలో ఉన్నత అధికారి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవిత బీమా సంస్థలో పెట్టుబడి పెడితే సొమ్ము భద్రం.. భవిత బంగారం అన్న నానుడి అందరికీ తెలిసిందే. అయితే జీవిత బీమా కార్యాలయంలో మాత్రం రాత్రికి రాత్రే టేకు చెట్లు మాయమవడం విశేషం. సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తన సొంత ఊరిలోని ఇల్లు కడుతుండగా అదే సమయంలో సిరిసిల్ల జీవిత బీమా సంస్థలోని 5 పెద్ద టేకు చెట్లు మాయమైనట్టు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో చెట్లను కొట్టుకొని వాహనంలో తరలించినట్లు సమాచారం.

సంస్థకు చెందిన సదరు ఉన్నతాధికారే ఇలాంటి పని చేయడంపై కిందిస్థాయి సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆఫీస్ ఆవరణలో ఉన్న చెట్లనే నరికి గుట్టు చప్పుడు కాకుండా తరలించిన ఆ అధికారి సంస్థలో ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడో అని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. టేకు చెట్లను తొలగించాల్సి వస్తే సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారి అనుమతి పొందాక తొలగించాల్సి ఉంటుంది. కానీ ఎవరి అనుమతి లేకుండానే సంస్థ ఆవరణలోని చెట్లను సొంతానికి వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ ఘటనపై సదరు అధికారిని వివరణ కోరగా అలాంటిదేమీ లేదంటూనే తమకు ఎవరు చెప్పారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story