సింగరేణి టార్గెట్ కంప్లీట్ అవుతుందా లేదా..?

by Dishanational1 |
సింగరేణి టార్గెట్ కంప్లీట్ అవుతుందా లేదా..?
X

దిశ, పెద్దపల్లి: సింగరేణి సంస్థ 2022‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–23‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌వార్షిక లక్ష్యానికి గడుపు సమీపిస్తున్నప్పటికీ అనుకున్న బొగ్గు ఉత్పత్తి మాత్రం అందుకు దూరంగా కనిపిస్తుంది. ముగింపునకు ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలి ఉండగా ప్రస్తుతం రోజుకు 2.2లక్షల​టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా మిగిలిన సమయంలో రోజుకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తేనే అనుకున్న లక్ష్యం చేరే అవకాశం ఉందని సింగరేణి అధికారులు అంటున్నారు. ఇప్పటికే పలు డివిజన్లు 11 నెలల్లో 100 శాతం ఉత్పత్తి సాధించగా ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రతియేటా కార్మికులకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఈసారి సింగరేణి సంస్థ ప్రకటించలేదు. మార్చి 31వ తేదీ వరకు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి 100 శాతం ఉత్పత్తి సాధించాలని సంస్థ భావిస్తున్నది.

70 మిలియన్ టన్నుల లక్ష్యం...

2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను 70 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది వర్షకాలంలో జూన్, జూలై, ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓపెన్​కాస్ట్​ గనుల్లో ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాకపోవడంతో గడిచిన 11 నెలల ఉత్పత్తి లక్ష్యంలో సింగరేణి సంస్థ వెనుకబడింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు 60 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించినట్లు అధికారులు చెబుతుండగా 30 రోజుల్లో మరో 10 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రతిరోజు 3 లక్షల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి చేస్తేనే మార్చి చివరి వరకు సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధిస్తుంది.

రోజుకు 3 లక్షల టన్నులు..

మార్చి చివరి వరకు సంస్థ అనుకున్న లక్ష్యం సాధించాలంటే ప్రస్తుతం రోజుకు 3లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థలో రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అయితే లక్ష్యం సాధించడానికి ప్రతియేడాది కార్మికులకు ప్రోత్సాహకాలను అందిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఈసారి ఇప్పటివరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి సంస్థ ఎలాంటి ప్రోత్సాహకాలను ప్రకటించలేదు. పలు చోట్ల 10 నెలల్లోనే 100 శాతం ఉత్పత్తిసింగరేణి సంస్థకు ఉన్న 11 ఏరియాల్లో నాలుగు డివిజన్ లలో మాత్రమే 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. సింగరేణి సంస్థకు కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, రామగుండం రివిజన్​ –1, రామగుండం రివిజన్​ –2, ఆర్టీ –3 (ఆడ్యాల లాంగ్​ వాల్ ప్రాజెక్ట్) భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్​డివిజన్లు ఉన్నాయి. 11 డివిజన్లకు నిర్ణయించిన ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించగా నాలుగు డివిజన్ల 10 నెలల్లో నిర్దేశించిన 100 శాతం ఉత్పత్తి సాధించినట్లు సింగరేణి అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ​జనవరి నెల 31వ తేదీ వరకు ఇల్లెందు, మణుగూరు, రామగుండం రిజియన్​ –1, రామగుండం రీజియన్​–2లు 100 శాతం ఉత్పత్తి సాధించగా ఫిబ్రవరి ముగిసేసరికి నాలుగు డివిజన్లు ఉత్పత్తి లక్ష్యాన్ని మించి బొగ్గు ఉత్పత్తి చేశాయి. ప్రస్తుతం రోజుకు 3లక్షల టన్నుల చొప్పున మార్చి 31 వరకు బొగ్గు ఉత్పత్తి చేస్తేనే సింగరేణి సంస్థ 2022–23 ఆర్థిక సంవత్సరంలో100 శాతం లక్ష్యం నేరవేరుతుంది.

Next Story

Most Viewed