గాలికి కూలిన ఓడేడు బ్రిడ్జి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 12 |
గాలికి కూలిన ఓడేడు బ్రిడ్జి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, పెద్దపల్లి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్ప కూలింది. ముత్తారం మండలం ఓడేడు వద్ద మానేరు నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి రాత్రిపూట కూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇదే బ్రిడ్జి గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి భీమ్ లు కొట్టుకుపోయాయి. పిల్లర్లు దెబ్బతిన్నాయి. తాజాగా అర్ధరాత్రి గాలిదుమారానికి బ్రిడ్జి పై ఉన్న మూడు సిమెంట్ గడ్డర్స్ క్రింద పడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు జిల్లాల మధ్య వారధి

పెద్దపల్లి - జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మద్య మానేర్ నది పై రాకపోకలు సాగించేందుకు ముత్తారం మండలం ఓడేడు, టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై 2016 లో బిఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి మంజూరు చేసింది. అదే సంవత్సరం 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 8 ఏళ్ళుగా పనులు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. నిర్లక్ష్యంగా పనుల్లో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టి పక్కన పెట్టింది.

నాడు అక్కడ.. నేడు ఇక్కడ

బ్రిడ్జి నిర్మాణ పనుల కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న శ్రీ సాయి కన్స్ట్రక్షన్ అబాసు పాలవుతుంది. ఇదే కాంట్రాక్టర్ గతంలో వేములవాడ వద్ద మూల వాగుపై చేపట్టిన బ్రిడ్జి అప్పట్లో కూలిపోయింది. అప్పట్లో ప్రభుత్వం విచారణ జరిపి కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టారు. ఆ సమయంలోనే ఓడేడు బ్రిడ్జి నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నష్టాల పాలు కావడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల కాంట్రాక్టర్ ను సైతం పక్కన పెట్టి ప్రభుత్వం పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇలాంటి సమయంలో రాత్రి గాలి దుమారానికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.



Next Story

Most Viewed