స్ట్రాంగ్ రూమ్ లో ఏం జరుగుతుంది..?

by Disha Web Desk 20 |
స్ట్రాంగ్ రూమ్ లో ఏం జరుగుతుంది..?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా నూకపల్లి శివారులో గల డాక్టర్ వి.ఆర్.కే ఇంజనీరింగ్ కళాశాలలో ధర్మపురి ఎలక్షన్ పిటిషన్ కు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలను హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు పగలగొట్టారు. పిటిషనర్ తో పాటు పలువురు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లోకి ఎంటర్ అయిన అధికారుల బృందం 17ఏ, 17సీ పత్రాల పరిశీలన మొదలుపెట్టింది. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ట్రంక్ పెట్టెలకు తాళాలు లేకపోవడంతో పిటిషనర్ లక్ష్మణ్ కుమార్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు.

సుమారు పది గంటలుగా సాగుతున్న పత్రాల పరిశీలనలో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయినట్లుగా సమాచారం. గత ఎన్నికలలో ధర్మపురిలో నయాభారత్ పార్టీ తరఫున బరిలో నిలిచిన దూడ మహిపాల్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూంలో భద్రపరచిన ఈవీఎంలకు, ఎలక్షన్ మెటీరియల్ కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించలేదని అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ ప్రక్రియలో కీలకమైన 17A, 17C డాక్యూమెంట్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో పొందుపరచలేదని సీసీటీవీ ఫుటేజ్ కూడా కనిపించడం లేదని ఆరోపించారు.

సుదీర్ఘంగా కొనసాగుతున్న పరిశీలన..

జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 11:30 గంటలకు స్ట్రాంగ్ రూమ్ లోకి ఎంటర్ అయిన అధికారుల బృందం డాక్యుమెంట్ పరిశీలనను మొదలుపెట్టింది. సుమారు పది గంటలుగా కొనసాగుతున్న పరిశీలన పూర్తవడానికి అర్థరాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మొత్తం పోలింగ్ బూతులకు సంబంధించిన 17A, 17C పత్రాలను వెరిఫై చేస్తున్న అధికారులు వాటిని ఒక్కో బూతుల వారీగా జిరాక్స్ తీయడంతో పాటు సాఫ్ట్ కాపీలను స్కాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.



Next Story