వీళ్లు మారరు..! మిల్లర్ల సిండికేట్ దందా

by Disha Web Desk 12 |
వీళ్లు మారరు..! మిల్లర్ల సిండికేట్ దందా
X

దిశ, బ్యూరో కరీంనగర్: ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు సిండికేట్ గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలపై ఆధారపడి పండించిన పంట చేతికొచ్చిందనే సంతోషాన్ని మిల్లర్లు ఆవిరి చేస్తున్నారు. ఐకేపీ, సింగిల్ విండోల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తీసుకెళ్తే తాలు, పచ్చగింజ పేరిట కొర్రీలు పెడుతూ కటింగ్‌లు పెడుతున్నారు. క్వింటాకు మూడు నుంచి ఐదు కిలోల చొప్పున ధాన్యాన్ని తరుగు తీస్తూ కొనుగోలు చేస్తున్నారు. ధాన్యాన్ని ఇలా కట్ చేసి తీసుకుంటే పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యంలో కోత విధించకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

భారమైన సాగు...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఎస్సారెస్పీ .ఎల్ఎండీ కింద సాగవుతుండగా.. మరికొన్ని ప్రాంతాలు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కింద సాగవుతున్నాయి అయితే మిగతా ప్రాంతాల్లో రైతులు బావులు, బోర్ల పై ఆధారపడి వరి పంటను సాగు చేశారు. అయితే ఈసారి రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి కొరత ఏర్పడగా కొంత మేరకు బావులు బోర్ల పై ఆధారపడ్డారు. దీంతో విద్యుత్ కోతతో హెచ్చుతగ్గులు ట్రాన్స్ ఫార్మర్లు, మోటర్లు కాలిపోయి ఇబ్బంది పడ్డారు. తద్వారా పెట్టుబడి కూడా రెట్టింపు అయింది. ఇంత నష్టాల్లో ఉన్న రైతులకు పంట చేతికి వచ్చాక దాన్ని అమ్మాలంటే మిల్లర్లతో పెద్ద సమస్యగా మారింది.

సివిల్ సప్లై అలాట్మెంట్ చేసిన మిల్లుల యజమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మిల్లుకు వెళ్లిన లోడ్ ట్రాక్టర్లను దిగుమతి చేసుకోవడం లేదు. పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఎంతో కొంతకు తీసుకోవాలనే విధానానికి తెర తీస్తున్నారు. రోజుల తరబడి వేచి ఉండలేక ట్రాక్టర్ కిరాయి భారం పడుతుందని ఉద్దేశంతో రైతులు మిల్లర్లు చెప్పిన కటింగ్ కు అంగీకరిస్తూ ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రైతులు క్వింటాకు 2 నుండి 5 కిలోలు నష్టపోతున్నారు.

దిగుబడి తగ్గింది...

వాన కాలంలో ఐదు ఎకరాలు సాగు చేయగా ఎకరాకు 40 బస్తాలు దిగుబడి వచ్చింది. యాసంగిలో బావి కింద మూడు ఎకరాలు సాగుచేసిన ఎకరాకు 25 బస్తాలే దిగుబడి వచ్చింది. సింగిల్ విండో ద్వారా వడ్లను కొనుగోలు చేసి మిల్లుకు తీసుకుపోతే వడ్లు పచ్చిగా ఉన్నాయని మూడు కిలోలు కట్ చేసిండ్రు. దీంతో నేను ఆర్థికంగా నష్టపోయా:-కాశిపాక సంపత్ , రైతు

రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం..

ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి అన్నారు. ఆయన ' దిశ 'తో మాట్లాడుతూ .. మిల్లర్లను సందర్శించి రైతుల బాధలను తెలుసుకుంటామని అన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై త్వరలో జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు.:-సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

Next Story