ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం : మండలి విప్ టి.భానుప్రసాద్ రావు

by Disha Web Desk 1 |
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం : మండలి విప్ టి.భానుప్రసాద్ రావు
X

దిశ, పెద్దపల్లి : రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాగు, తాగునీటి రంగంలో చారిత్రక పురోగతి సాధించామని, నీటి పారుదల రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భాను ప్రసాద్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలోని నందన గార్డెన్స్ లో నిర్వహించిన సాగు నీటి వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.

తాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతి వివరాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాలను ప్రభుత్వ చీఫ్ విప్, జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ప్రభుత్వం సాగునీటి రంగంలో చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెక్ డ్యాంల నిర్మాణాలను తెలియజేస్తూ రూపొందించిన వీడియోలను వేడుకలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీప్ విప్ టి.భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ.. 1969 ఉద్యమ సమయంలో ఉద్యోగాలు, నిధుల నినాదం ఉండేదని, ఆ తరువాత మన ప్రాంతాలలో గొలుసు కట్టు చెరువులు, నీటి వనరులను ధ్వంసం చేస్తూ గ్రామీణ జీవితాలను అతలాకుతలం చేశారని అన్నారు.

ఉమ్మడి పాలనలో గంగాళంలా ఉన్న మన చెరువులను తాంబాలంలా మార్చారని ఆవేదన చెందామని ఆయన గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజలను మభ్య పెట్టే దిశగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఆన్ రికార్డు ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి పనికి రాదని, నీళ్లు రావని చెప్పారని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో మహారాష్ట్రలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రాణహిత వద్ద పనులు చేపట్టలేదని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంత అవసరాలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు.

రికార్డ్ సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ముందస్తుగా చిన్న నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించి ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన చెరువుల పునరుద్ధరణ దిశగా కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని, రాజకీయాల కతీతంగా ప్రతి చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టి తాంబాలంలో ఉన్న చెరువులను మరోసారి గంగాళం లా మార్చారని ఆయన తెలిపారు.పెద్దపల్లి జిల్లాలో సైతం 218 కోట్లను ఖర్చు చేసి 650 చెరువులను పునరుద్ధరించారని అన్నారు.

మిషన్ కాకతీయ కారణంగా మండు వేసవి కాలంలోనూ గ్రామాలలోనీ చెరువులు నీటితో కళకళలాడుతున్నా యని , వాగులు పొంగి పొర్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన వ్యయం పై జరుగుతున్న దుష్ప్రచారాలపై ప్రభుత్వ చీఫ్ విప్ మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రెండు రిజర్వాయర్లు 2 టీఎంసీలతో సామర్థ్యం తో ఉంటే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 15 రిజర్వాయర్లను 147 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించుకున్నామని, గతంలో భూ నిర్వాసితులకు ఎకరానికి 50 వేలు ప్రతిపాదిస్తే, నేడు ఆరు లక్షల నుంచి 12 లక్షల వరకు పరిహారం అందించామని, నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిన దృష్ట్యా కాళెశ్వరం వ్యయం పెరిగిందని అన్నారు.

మన దేశంలో 140 కోట్ల జనాభా ఉందని, కరువు వచ్చిన పరిస్థితులలో మన దేశానికి ఆహారం అందించే సామర్థ్యం ప్రపంచంలో ఎవరికీ లేదని, భగవంతుడు అందించిన నీటి వనులను, ప్రతినీటి బొట్టు సమర్థవంతంగా వినియోగించుకుంటూ శాశ్వతంగా కరువును పారద్రోలి దిశగా సీఎం కేసీఆర్ పటిష్ట అడుగులు వేశారని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ త్రాగునీటి కష్టాలను తీర్చారని, ఇతర రాష్ట్రాలలో సగం గ్రామాలకు కూడా త్రాగునీరు అందని పరిస్థితి ఉంటే మన దగ్గర ప్రతి ఇంటికి త్రాగు నీరు, వ్యవసాయానికి సాగు నీరు అందించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్ పర్సన్ రేణుక, జడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed