రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటు పరం చేయడం అసాధ్యం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటు పరం చేయడం అసాధ్యం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

సింగరేణి ప్రైవేటీకరణ పేరుతో అధికార పార్టీ దొంగ డ్రామాలు

దిశ, కరీంనగర్: రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి కేటాయించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పుడు.. ప్రైవేటీకరణ పేరుతో బీఆర్ఎస్ రాద్ధాంతం చేయడం ఎందుకని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణిలో 51% వాటా రాష్ట్రానికి, 49 శాతం వాటా కేంద్రానికి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ జోక్యం, అనుమతి లేకుండా ప్రైవేటు పరం చేసే అవకాశమే లేదన్నారు. రెండు చేతులు కలిస్తేసే చప్పట్లు.. అన్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలసి సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

శనివారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్‌లో లోకసభ మాజీ సభ్యుడు పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ కుట్రలు ఛేదించేందుకు తాము కార్మికుల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని తెలిపారు. భద్రాచలం సీతమ్మ తల్లి పాదాల చెంత నుంచి అసీఫాబాద్ వరకు గోదావరి తీరం వెంట విస్తరించి ఉన్న సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటిదన్నారు.

ఈ సంస్థను విస్తరించకుండా, క్రమేపి కుదిస్తూ దొంగ నాటకాలకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ నెపంతో అధికార పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు. ఈ విషయం చూస్తే ‘దొంగే దొంగ’ అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల వేలానికి సంబంధించి 2015లో మైన్స్, మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులైజేషన్ యాక్ట్ తీసుకువచ్చారని ఆయన తెలిపారు.

ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న అధికార పార్టీకి చెందిన నేతలు బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్ మద్దతు తెలిపి అనుకూలంగా ఓట్లు వేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ చట్టానికి అనుగుణంగా నేడు బొగ్గు గనుల వేలం జరుగుతోందన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గుజరాత్, ఝార్ఖండ్ ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు అక్కడి బొగ్గు గనుల వేలం ప్రక్రియను నిలిపి వేసిన కేంద్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందన్నారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలంపై ఇక్కడి ప్రభుత్వం కనీసం స్పందించ లేదని ఆరోపించారు.

సింగరేణి సంస్థ తమ ఆధ్వర్యంలోని బొగ్గు గనుల్లో స్వయంగా బొగ్గు వెలికి తీయకుండా, ఆ పనిని ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అదిలాబాద్ జిల్లా ఇందారం, శ్రీరాంపూర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ బొగ్గు గనులను ఆయన ఇందుకు ఉదాహరణగా చూపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం అంటూ ఉండదని ముఖ్యమంత్రి అనేకసార్లు ప్రకటించారు. సింగరేణిలో మాత్రం గడచిన ఎనమిదేళ్లలో సంవత్సరాల కాలంలో 63 వేల ఉద్యోగాలను 43 వేలకు కుదించారు. ఈ అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకు సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని ఓ ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటికి సింగరేణి డిపాజిట్లు రూ.3,500 కోట్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంస్థ రూ.10వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉందన్నారు. అరబిందో శరత్ చంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న వ్యాపార లావాదేవీలతోనే కోయగూడెం బొగ్గు బ్లాక్ వారికి దక్కేలా చూశారు. తాడిచర్ల ప్రాజెక్టు జెన్ కో నేపంతో ప్రైవేట్ పరం చేశారని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో మరో 50 వేల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం సింగరేణిలోని 35 వేల మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story