సర్పంచ్ ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
సర్పంచ్ ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్ర అభివృద్ధికి ఆయువుపట్టైన గ్రామాలను అభివృద్ధి పథంలో నడుపుతూ.. జాతీయస్థాయిలో అవార్డులు సాధించడంలో కీలకమైన సర్పంచ్ లకు నిధులు విడుదల చేయకుండా వారి హక్కులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో హరితహారం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచ్ లు విజయవంతంగా చేబడితే వారికి చెల్లించాల్సిన నిధులను చెల్లించకుండా జాప్యం చేస్తూ సర్పంచ్ లను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని ధ్వజమెత్తారు.

రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు రావాల్సి ఉన్నాయని వెంటనే ఆ నిధులను విడుదల చేసి సర్పంచ్ ల అప్పుల బాధలను తీర్చాలని డిమాండ్ చేశారు. నిధులు వచ్చినప్పుడు డిజిటల్ కీ సహాయంతో మండల పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల కరెంటు చార్జీలు, ట్రాక్టర్ వాయిదాలు చెల్లిస్తూ సర్పంచ్ ల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పంచాయతీల నిధుల విడుదలను జాప్యం చేస్తూ సర్పంచ్ లను బలి తీసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి స్థానిక సంస్థలకు పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, నాయకులు గాజెంగి నందయ్య, జున్ను రాజేందర్, చాంద్ పాషా, సర్పంచ్ లు రమ్య లక్ష్మణ్, సంధ్య శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ భూమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed