పల్లెల్లో రగులుతున్న ఇథనాల్ చిచ్చు..

by Disha Web Desk 20 |
పల్లెల్లో రగులుతున్న ఇథనాల్ చిచ్చు..
X

దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటయ్యే పరిసర గ్రామాల్లో రోజురోజుకు ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చిచ్చు రగులుతూనే ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనను పోలీసులు అన్నివిధాల అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ఒత్తిడి పెరిగినకొద్ది ప్రజలు మరింతగా రెచ్చిపోతున్నారు. గత రెండు రోజులుగా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పాషిగాంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా ఆదివారం తాజాగా స్తంభంపల్లిలో ఇథనాల్ మంటలు చెలరేగాయి. మా గ్రామంలో ఇథనాల్ పరిశ్రమ వద్దంటే వద్దు, గ్రామసభ పెట్టి ప్రజాభిప్రాయ గ్రామపంచాయతీ తీర్మానం ఎలా ఇచ్చారని మండిపడుతూ గ్రామస్తులు ఆదివారం స్తంభంపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా నిరసన కారులంతా ఏకమై గ్రామపంచాయతీలో బైఠాయించారు.

సర్పంచ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామపంచాయతీకి సర్పంచ్ వచ్చి సమాధానం చెప్పేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదని మొండికేశారు. సమాచారం అందుకున్న సర్పంచ్ చల్లూరి రూపా రామచంద్రం పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. రూ 1కోటి తీసుకొని ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి అనుమతిచావని ప్రజలు ఆరోపణలు గుప్పించారు. పైసలకు ఆశపడి ప్రజల ప్రాణాలను బలిస్తావా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్యన తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ధర్మపురి సిఐ బిల్ల కోటేశ్వర్ వెల్గటూర్ ఎస్సై నరేష్ కుమార్ జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింప చేశారు. శాంతియుతంగా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భర్త రామచంద్ర మాట్లాడుతూ నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. గ్రామం అభివృద్ధి జరుగుతుందని మంత్రికొప్పుల ఈశ్వర్ చెప్పడంతోటే తీర్మానం ఇచ్చామన్నారు. తీర్మానం ఇవ్వడంలో ఎలాంటి దురుద్దేశం లేదు.

పరిశ్రమ నిర్మాణంతో మీకు నష్టం జరుగుతుందని భావిస్తే నేనిచ్చిన పంచాయతీ తీర్మానం తిరిగి వాపస్ తీసుకుంటానని ప్రజలకు హమీ ఇవ్వటం విశేషం. సర్పంచ్ ఎంపీటీసీ ప్రజల అబీష్టం మేరకే నడుచుకోవాలని హెచ్చరించారు. ఇతనాల్ పరిశ్రమ నిర్మాణం కోసం మద్దతుగా ఇచ్చిన తీర్మానం వెనక్కి తీసుకొని తిరిగి వ్యతిరేక తీర్మానం చేయాలని స్తంభంపల్లి సర్పంచును ప్రజలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే పాషి గ్రాం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఇప్పటికీ కొనసాగుతుంది. ఊరు చుట్టూ పోలీసులు పహార కాస్తున్నారు. మూకుమ్మడిగా జనం బయటకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని ప్రజలందరూ ఏకమై ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలనీ సర్పంచ్ పై ఒత్తిడి పెంచారు. ప్రజల డిమాండ్ కు తలొగ్గిన సర్పంచ్ బొప్పు తిరుపతి ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ప్రజలకు అందజేశారు.

Next Story

Most Viewed