దిశ ఎఫెక్ట్...తాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకుంటాం

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్...తాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకుంటాం
X

దిశ, వేములవాడ : దిశ పత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి స్పందన లభించింది. డెడ్ స్టోరేజీలో మిడ్ మానేరు అనే శీర్షికతో శుక్రవారం దిశలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్​ గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరంలో ఉన్న మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ తో పాటు అగ్రహారంలోని నీటి శుద్ధి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా సరఫరా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

మధ్య మానేరు జలాశయం (శ్రీ రాజ రాజేశ్వర జలాశయం) లో నీటి నిలువ పూర్తి స్థాయి సామర్ధ్యం 27.50 టీఎంసీ గాను ప్రస్తుతం 5.90 టీఎంసీ కి తగ్గడం వలన ఈ వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీటి అవసరాలు, ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీటి లభ్యత వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథకు మూడు నెలల కాలానికి గాను 0.36 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని, ప్రస్తుతం జలాశయంలో తాగు నీటి కోసం మొత్తం 4 టీఎంసీల వరకు లభ్యత ఉందని మిషన్ భగీరథ అధికారులు కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా ప్రతి గ్రామానికి అవసరమయ్యే, సమృద్ధిగా తాగునీటి సరఫరా చేయాలని సదరు అధికారులను ఆదేశించారు. వారి వెంట జిల్లా అదనపు కలెక్టర్ గౌతమి పూజారి, మిషన్ భగీరథ సీఈ అమరేంద్ర, ఎస్ఈ రవీందర్, ఈఈలు విజయ్ కుమార్, జానకి తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed