కొత్త పెన్షన్, రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 14 |
కొత్త పెన్షన్, రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేబి కాలనీలో ఇళ్లు లేని వారికి మొదట ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఇళ్లు చూసి బాధపడ్డ.. దీనిపై అసెంబ్లీలో మాట్లాడినట్లు గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ లో పదేళ్లలో అధికారంలో ఉండి 2 వేల పెన్షన్ తప్ప ఏం చేశారని ప్రశ్నించారు.

డబుల్ బెడ్రూం ఇచ్చారా..? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా..? దళిత బంధు వచ్చిందా..? ఉద్యోగాలు వచ్చాయా..? రుణమాఫీ చేయలేదని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుందన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు రూ. 500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఎవరికైనా రాకపోతే అధికారులకు చెప్పాలని సూచనలు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, మీకు కరెంటు బిల్లు లేకుండా చేస్తున్నామని అన్నారు.

పది లక్షల ఆరోగ్య శ్రీ ఇస్తున్నామని, ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బంది ఉంటే తనకు చెప్పాలని, తానే దగ్గర ఉండి చికిత్స చెపిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని, ఇప్పుడున్న పెన్షన్లు 4 వేలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రూ. 2500 ఇస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని సూచించారు.

Next Story

Most Viewed