నిర్విద్ధంగా శ్రీ శ్రీ యుగ కవి

by Ravi |
నిర్విద్ధంగా  శ్రీ శ్రీ యుగ కవి
X

ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపి, అప్పటి వరకు సమాజంలో ఉన్న అన్ని రకాల దోపిడీ సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన సిద్దాంతం కమ్యునిజం. ఆ సిద్దాంతపు లోతుల్ని అత్యంత సులభగ్రాహ్యంగా తన ‘దేశ చరిత్రలు’ కవిత ద్వారా తెలుగు పాఠకలోకానికి, కొండొకచో తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేసిన వాడు శ్రీ శ్రీ. ఆ ఒక్క కవిత చాలదా ఆయన్ని మహా కవిగా నిలబెట్టడానికి.

సరికొత్త ఆలోచనలతో..

శ్రీ శ్రీకి ముందు, సమకాలంలోనూ, అనంతర కాలంలోనూ ప్రసిద్ధులైన కొందరు కవుల పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళెందుకు మహాకవులు కాదు.. శ్రీ శ్రీయే ఎందుకు మహాకవిగా గుర్తించబడ్డాడు? ఇందుకు ఆయన కులమే కారణం కదా! ఆ కులం వాళ్ళని గొప్ప వాళ్ళుగా చూపారు తప్ప ఇతర కులాలలో పుట్టిన కవుల్ని గుర్తించలేదు. పైపెచ్చు కమ్యూనిస్ట్‌లు ఆయన్ని భుజానికెత్తుకొని మహాకవిని చేశారు... ఇలాంటి అసంబద్ధ వక్రీకరణలెన్నో పుంఖాను పుంఖాలుగా వెల్లడించారు వ్యాఖ్యాతలు. శ్రీశ్రీకి పేరు రావడానికి, మహా కవిగా గుర్తించబడడానికి తను పుట్టిన కులమే కారణమైతే, అదే కులంలో పుట్టి, ఆ కాలపు సాంప్రదాయ వాదుల నీరాజనాలందుకుని, జ్ఞాన పీఠ పురస్కార స్వీకర్త అయిన విశ్వనాథను మహాకవిగా నిలబెట్ట లేకపోయారెందుకని? ఎందుకంటే అప్పటి వరకు తెలుగు సాహిత్యం చవి చూడని నడకల్ని శ్రీశ్రీ ఒడిసి పట్టాడు కాబట్టి. సరికొత్త సమ సమాజ సామ్యవాద భావజాలాన్ని తన కవిత్వం ద్వారా ఎత్తి చూపాడు కాబట్టి. కొత్త నడకతో, సరికొత్త ఆలోచనలతో ఊహా ప్రపంచపు సాహిత్యాన్ని భూమార్గం పట్టించాడు కాబట్టి. సామాన్యుడి చుట్టూ సాహిత్యం తిరిగేలా చేశాడు కాబట్టి. ... ఇన్ని కారణాల రీత్యా శ్రీ శ్రీ మహా కవిగా గుర్తించ బడ్డాడే తప్ప పుట్టిన కులం కారణంగానో, కమ్యూనిస్టులు మోయడం వల్లనో కాదు. ఈ విషయం తెలిసి కూడా హ్రస్వ దృష్టితో ఆ కులంలో పుట్టాడు కాబట్టే ఆయన్ని మహా కవిని చేశారనో, కమ్యూనిస్టులు మోశారనో అనడం సమంజసం కాబోదు. పై కారణాలు లేకుండా కమ్యూనిస్టులు మోసేస్తే మహా కవులు అయ్యేట్లైతే తెలుగు నాట మహా కవులు వందల్లో ఉండాలి. ఉన్నారా?

చదవడం రాని వారికి కూడా అర్థమయ్యేలా..

ఆయన భాషంతా శిష్ట వ్యావహారికం, బ్రాహ్మణీకం అయినప్పుడు ఆయన ప్రజాకవి ఎట్లా అవుతాడు? ఆయన ప్రజల భాషలో ( మాండలీకంలో ) రాయనే లేదు కదా! సామాన్య ప్రజలకు ఆయన భాష అర్థం కాదు కదా! అని మరి కొందరు వాదిస్తున్నారు. అప్పటి వరకు ఉన్న కావ్య భాష చాలా మంది శిష్ట వ్యవహారికులకు కూడా అందనిది, అర్థం కానిది. మరొకరెవరో టీకా తాత్పర్యంతో వివరిస్తే తప్ప అర్థం చేసుకోలేనంతటిది. దాన్ని ఛేదించి ఆ భాషలోని, అప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న పురాణాల్లోని ప్రతీకలతోనే కొత్త అర్ధాలని పుట్టించి, సరికొత్త నడకల్ని సృష్టించాడు శ్రీ శ్రీ. అప్పటి కది ప్రగతి. అందుకే అతని కవిత్వం చదవరులైన ప్రతి ఒక్కరికీ చేరువైంది, అర్థమైంది. చదవడం రాని పామరులు కూడా వివిధ ప్రజా వేదికల ద్వారా శ్రీ శ్రీ కవిత్వాన్ని విని అర్థం చేసుకోగలిగారు. ఆ అక్షర నడకకు, తన సామ్యవాద ఆలోచనలకు ముగ్ధులయ్యారు. సినీ గీతాల ద్వారా కూడా సామాన్యులకు చేరువ కాగలిగాడు. ఇలా అప్పటి వరకు సాహిత్యానికి ఆవల ఉన్న విస్తృత జన బాహుళ్యానికి తన కవిత్వం ద్వారా చేరువయ్యాడు కనుకే శ్రీ శ్రీ ప్రజా కవి అయ్యాడు. ఇంతటి మహత్తర కృషి, అప్పటి వరకు తెలుగు సాహిత్యంలోకి తొంగి చూడని కొత్త చూపు శ్రీ శ్రీ ని మహా కవిగా, ప్రజా కవిగా నిలబెట్టాయే తప్ప ఎవరో నిలబెడితే నిలిచింది కాదు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా శ్రీ శ్రీ నిర్విద్ధంగా యుగ కవి, మహా కవి, ప్రజా కవి.

- వి.ఆర్. తూములూరి

97052 07945

Next Story