మానెరు వాగులో ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతాం: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Disha Web Desk 1 |
మానెరు వాగులో ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతాం: ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, హుజూరాబాద్: మానేరు వాగులో ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రత్యేక కార్యాచరణకు చేపడతామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈటల విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోగా ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆ నిబంధనలను పాటించడం లేదన్నారు. తాను చెప్పింది వేదం అన్నట్టు సీఎం వ్యవహరిస్తుండగా కొందరు అధికారులు బసవన్నల్లాగా తలూపుతూ జీవోలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం సడ్డకుడు రవీందర్ రావు ఆంధ్ర కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఇప్పించి మానేరు వాగును చెరబట్టి ఇష్టానుసారంగా ఇసుక తరలిస్తూ.. భూగర్భ జలాలు అడుగంటేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బోరు బావులు ఎండిపోయి భవిష్యత్తు అవసరాలకు కూడా ఇసుక లభ్యం కానీ పరిష్టితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాగుల్లో నుంచి ఇసుక తరలించవద్దని కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకొచ్చినా తవ్వకాలు ఆపడం లేదన్నారు.

ఈ విషయంలో ఎదురు మాట్లాడిన రైతులపై పోలీసులతో కేసులు పెట్టిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని చల్లూరు, నర్సింహులపల్లి, కల్లుపల్లె, కొండపాక గ్రామాల్లో ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లు ప్రారంభించడంలో జాప్యమవుతున్న కారణంగా అకాల వర్షాలకు కళ్లాల్లోని ధాన్యం తడిసి, కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి నేరుగా మిల్లుల వద్ద ధాన్యం దించుకునేలాగా చర్యలు చేపట్టాలన్నారు.

ధరణిపై హైకోర్టు వ్యాఖ్యలు చెంప పెట్టు..

ధరణి పోర్టల్ పై వేసిన కేసులపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని చెంప పెట్టులాంటిదని ఈటల రాజేందర్ అన్నారు. ధరణిలో ఉన్న లోపాలను సరి చేసేందుకు రెండేళ్ల సమయం పడుతోందని స్వయంగా వికారాబాద్ కలెక్టర్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడని గుర్తు చేశారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల ధరణి పోర్టల్ తో లక్షల మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. లావణి పట్టా కలిగిన దళితులకు, ఎక్సాల్ పట్టా, అసైన్మెంట్ పట్టాలు కలిగిన పేదలకు పాస్ పుస్తకాలు రాక వారికి రైతుబంధు, రైతు భీమా వర్తించడం లేదన్నారు. ఇప్పటికైనా ధరణి పోర్టల్ ను రద్దు చేసి నష్టపోయిన రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఎర్రబెల్లి సంపత్ రావు, గోపు కొమురా రెడ్డి, మల్లేష్, గంగిశెట్టి రాజు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed