తెలంగాణలోనూ మోడీ వేవ్ నడుస్తుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
తెలంగాణలోనూ మోడీ వేవ్ నడుస్తుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ వేవ్ కనిపిస్తోందని బిజెపి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, మియాపూర్, హైదర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచు కోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో న్యాయబద్ధంగా కాంగ్రెస్ ఎదుర్కోలేక పోయిందని ఆయన విమర్శించారు. ఆ పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఎంఐఎం పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకే ముస్లిం వర్గాల ఓట్లు అధికంగా పోలవుతాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పచ్చి మతతత్వ పార్టీ అని ఆయన విమర్శించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తుందని దాని ద్వారా ఓబీసీలకు నష్టం జరుగుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ముస్లిం, మైనార్టీ వర్గాల్లోని విద్యావంతులు, మహిళలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. మక్కా, జెరుసలెం ప్రాంతాలను సందర్శించే వారికి రాయితీలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ.. హిందూ దేవాలయాలను సందర్శించే వారికి ఎందుకు రాయితీలు ఇవ్వదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

మనదేశంలోని ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉందని ప్రపంచంలో మరెక్కడా కూడా ఇలాంటి పరిస్థితి లేదని ఆయన చెప్పారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కామన్ సివిల్ కోడ్ తెచ్చారని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో నష్టపోయిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మోదీ ఆర్థిక విధానాల కారణంగా ఇవాళ లాభాల్లో నడుస్తున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మియాపూర్ ప్రాంతంలోని దివ్యశక్తి అపార్ట్ మెంట్, మయూరి నగర్ పార్క్, వెర్టెక్స్ ప్రైడ్, హైదర్ నగర్ పరిధిలోని వశిష్ట అపార్ట్ మెంట్, కావ్య గ్రీన్ అపార్ట్మెంట్, వే వెర్టెక్స్ ప్రెసెంట్, వెర్టెక్స్ కళ్యాణ్ రెసిడెన్సి, ఎస్సార్ రెసిడెన్సి, జలవాయు విహార్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లోని ప్రజలతో ఆయన మాట్లాడారు. 13న జరగనున్న పోలింగ్ లో పాల్గొని తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, హరిబాబు, రాజు, పలువురు కార్యకర్తలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed