గొర్రెల పంపిణీ కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా

by Disha Web Desk 1 |
గొర్రెల పంపిణీ కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
X

డీడీలు కట్టిన గొర్రెల పంపిణీ ఎప్పుడు : గొల్ల కురుమలు

దిశ, కరీంనగర్ టౌన్ : గొర్రెలు, మేకల పెంపకదార్ల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ కోసం గత ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నామని మండిపడ్డారు. గొల్ల, కురుమలకు 2017లో రెండేళ్లలో పంపిణీ పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని తెలిపారు.

75 శాతం సబ్సిడీ గొర్రెల పంపిణీ ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఎంతో ఆర్భాటంగా మొదలు పెట్టి ఆరేళ్లుగా నానబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు జరిగిన చోట గొర్రెల పంపిణీ గుర్తుకు వస్తుందన్నారు. కొంతమంది లబ్ధిదారులకు పంపిణీ చేసి ఎన్నికలు అయిపోగానే దాటవేస్తారా అని గొల్ల కురుమల్లో అనుమానంతో గందరగోళానికి గురి అవుతున్నారని తెలిపారు. నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయడం వలన గొల్ల, కురుమలకు నిజమైన లబ్ధి చేకూరుతోందని తెలిపారు.

గొర్రెలు మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, నిబంధనలు సడలించి కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ నుంచి కాకుండా సొసైటీ అధ్యక్షులు సంతకంతో అనుమతించాలని అన్నారు. డీడీలు చెల్లించిన వారికి వెంట వెంటనే గొర్రెల పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా 2017 ఏ, బీ లిస్ట్ లో మిస్సయిన వారికి ఇప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతి గొల్ల, కురుమలకు సీ లిస్ట్ ద్వారా పథకం అమలు చేయాలన్నారు. జీవాలు అన్నింటికీ ప్రభుత్వం ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు.

జాతి పశు సంపద పెంచే క్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న గొల్ల కురుమలకు ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా కుటుంబానికి ఇవ్వాలన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతి గొర్రెల కాపరికి నెలకు రూ.5 వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు పొనగాని మహేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వేల్పుల కొమురయ్య, పిల్లి రవియాదవ్, జిల్లా నాయకులు జెట్టి కొమురెల్లి, కాల్వ నర్సయ్య, భూస అయిలయ్య, మీసం రాములు, చిమ్మల్ల తిరుపతి కురుమ, అఖిలభారత యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మడబోయిన నర్సయ్య యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి ఓదెలు యాదవ్, నల్లెంగి కొమురయ్య యాదవ్, తిమ్మన బోయిన ఓదెలు యాదవ్, కాల్వ సంపత్, చిలుకూరి బాలయ్య, దుడ్డు నాగరాజు యాదవ్, ఎలుక రాజు యాదవ్, దాడి శ్రీశైలం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed