పూర్తయిన ధాన్యం సేకరణ.. సవాలక్ష కొర్రీలు పెట్టి రైతులను దోచుకున్న మిల్లర్లు

by Disha Web Desk 12 |
పూర్తయిన ధాన్యం సేకరణ.. సవాలక్ష కొర్రీలు పెట్టి రైతులను దోచుకున్న మిల్లర్లు
X

దిశ, మంచిర్యాల : వానా కాలం 2022-23 ధాన్యం కొనుగోళ్ల సేకరణ పూర్తయింది. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యం కేటాయించిన మిల్లులకు సీఎంఆర్(కష్టం మిల్లింగ్ రైస్) కింద చేరుకుంది. ఈ క్రమంలో మిల్లర్లకు పంట పండింది. తరుగు పెట్టి రైతుల నుంచి అదనపు ధాన్యాన్ని దోచుకున్నారు.

తరుగు ధాన్యం ఒక్కొక్క మిల్లర్కు అదనంగా రూ.లక్షల్లో జేబులు నింపగా అన్నదాత నష్టాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చింది. ఈ తతంగం సంబంధిత అధికార యంత్రాగం దృష్టిలో పడినా మిల్లర్ల వైపు అధికార పార్టీ బడా నేతల అండదండలు ఉండడంతో కిమ్మనలేక పోయారనే విమర్శలున్నాయి. జిల్లాలో గత నవంబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా ఎట్టకేలకు కొనుగోళ్ల సేకరణ పూర్తయింది.

తప్పని పరిస్థితుల్లో..

మంచిర్యాల జిల్లాలో ఐకేపీ, డీసీఎంఎస్ ల ద్వారా 243 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 25,795 మంది రైతుల నుంచి రూ. 314 కోట్ల విలువగల 1.53 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని సేకరించారు. అందులో 90 శాతం మేర రైతులకు వారి ఖాతాల్లోకి డబ్బులు చేరిపోయాయి. గత యేడాది వానా కాలం 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగగా, ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లు అంతకు మించి పోయాయి. ఈ యేడాది అధిక వర్షాలు వాతావరణ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని దొడ్డు రకాలైన ఎంటీయూ 1001,1010 ఎక్కువ సాగు చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2060, కామన్ రకానికి రూ. 2040 కావడంతో ఆ రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు మొగ్గు చూపారు. అంతా బాగానే ఉన్నా.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరుగు పెట్టి అదనపు ధాన్యం రానిదే ఆ రైతుల ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు సవాలక్ష కొర్రీలు పెట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు తరుగుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

తరుగు ధాన్యం లేనిదే..

కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని అప్పగించేందుకు సీఎంఆర్(కష్టం మిల్లింగ్ రైస్) కింద జిల్లాలోని 48 రైస్ మిల్లులకు కేటాయించారు. మరి కొంత ధాన్యాన్ని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని రైస్ మిల్లులకు సైతం కేటాయించారు. మిల్లర్ల నుంచి ధాన్యం తరుగు పై గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన అధికారులు గట్టి చర్యలు చేపట్టకపోగా.. కొనుగోలు కేంద్రాల నుంచే తరుగు దోపిడీ ప్రారంభమైంది. బస్తా(40 కిలోల)కి కిలోన్నర నుంచి రెండు కిలోల తరుగు పెట్టి అదనపు ధాన్యంతో బస్తాలు నింపి కేటాయించిన మిల్లులకు పంపించారు. అంటే క్వింటాల్‌కి సుమారు నాలుగు కిలోల మేర దోపిడికి రైతులు గురయ్యారు.

లక్సెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో తిప్పని మల్లేష్ అనే రైతు 300 బస్తాల తూకం వేయిస్తే తరుగు కింద 6 క్వింటాళ్ల ధాన్యం అదనంగా తూకం వేసి కేటాయించిన రైస్ మిల్లుకు పంపించారు. అంటే ఆ రైతు రూ.12 వేల మేర నష్టం చవిచూడాల్సి వచ్చింది అలాగే కొత్తూరు కొనుగోలు కేంద్రంలో చెరుకు వెంకటి అనే రైతు 70 బస్తాల ధాన్యానికి 3.50 క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు కింద అదనంగా తూకం వేసి మిల్లుకు పంపించారు.

ఈ రైతు రూ. 3400 వరకు నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చాలామంది రైతులు వేల రూపాయల్లో తరుగు పేరిట మిల్లర్లకు అదనపు ధాన్యాన్ని ఇచ్చి నష్టపోయారు. తరుగు తీసి అదనపు ధాన్యం తో వచ్చిన లారీలను మాత్రమే అన్లోడింగ్ కి మిల్లర్లు ఓకే చెప్పారని రైతులంటున్నారు.

నిబంధనలు పక్కనపెట్టి..

40 కిలోల బస్తా సంచి బరువు 650 గ్రాములు ఉంటుంది. నిబంధన ప్రకారం ఒక బస్తా కి 40.650 కిలోల ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపించాల్సి ఉంటుంది. ఆ మేరకు మిల్లులకు వచ్చే ధాన్యం బస్తాలను మిల్లర్లు దించుకోవాల్సి ఉండగా తరుగుతో బస్తాకు కిలోన్నర నుంచి రెండు కిలోల అదనపు ధాన్యం రానిదే అన్లోడింగ్ కి సవాలక్ష కొర్రీలు పెట్టారని రైతులు వాపోతున్నారు. క్వింటాల్ కి మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగుతో అదనపు ధాన్యం లేనిదే మిల్లర్ల వద్ద ధాన్యం లారీల అన్లోడ్ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

తరుగు పేరిట అదనపు ధాన్యం మిల్లులకు వెళ్లకపోతే తాలు, తప్ప, తేమ ఉన్నాయని మిల్లర్లు పెట్టిన కొర్రీలతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి అన్నదాతకు ఏర్పడింది. ఏదేమైనా గత సీజన్ ల తరహాలోనే ఈ ఖరీఫ్ సీజన్ లో తరుగుతో అక్రమంగా మిల్లర్లకు డబ్బుల పంట పండగా రైతులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.


Next Story

Most Viewed