గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా : బండి సంజయ్

by Disha Web Desk 13 |
గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా : బండి సంజయ్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ సమయంలో గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 500 కోట్ల రూపాయలతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్యలు గాలికి వదిలేసాడని బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్ ను గల్ఫ్ జేఏసీ ప్రతినిధుల బృందం మరికొందరు బాధితులు కలిసి తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు కండకావరం తలకెక్కిందని ఎన్నికల అప్పుడు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ఆ తర్వాత గల్ఫ్ కార్మికులను అసభ్య పదజాలంతో దూషించిన మూర్ఖుడని మండిపడ్డారు.


కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండి అప్పుల పాలై కుటుంబ పోషణ, ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన కార్మికులు ఇప్పటికీ సరైన పనులు దొరకక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారని సంజయ్ అన్నారు. సంగ్రామ యాత్రలో అనేక మంది గల్ఫ్ బాధితుల కుటుంబీకులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారని తెలిపారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి పార్థివ దేహాలను 3 నెలలు, 6 నెలలు అయినా తెప్పించలేని పరిస్థితి నెలకుందన్నారు.


గల్ఫ్‌లో చనిపోయిన వాళ్లకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పిన హామీ గానే మిగిలిందన్నారు. ఉద్యమ సమయంలో కార్మికులు గల్ఫ్‌లో జై తెలంగాణ అని నినదించి, కేసీఆర్‌కు డబ్బులు పంపించారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వలసలు ఆగలేదని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఉపాధి కోసం గల్ఫ్ బాట ఎందుకు పడతారని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అక్కడ జైల్‌లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేస్తానని సంజయ్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Next Story

Most Viewed