రేవంత్‌ సర్కార్‌కు కల్వకుంట్ల కవిత హెచ్చరిక

by Gantepaka Srikanth |

రేవంత్‌రెడ్డి సర్కార్ చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే కుట్రలు చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు.

రేవంత్‌ సర్కార్‌కు కల్వకుంట్ల కవిత హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి సర్కార్ చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే కుట్రలు చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. సీఎం పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖ ఆధ్వర్యంలోని యూనిఫామ్‌ల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్లపై ఆధారపడిన చేనేత కార్మికుల పొట్ట కొట్టే దుర్మార్గం చేస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.105 కోట్ల విలువైన యూనిఫామ్‌ల ఆర్డర్‌ను రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాలకు ఇస్తుంటారని.. దీని ద్వారా సహకార సంఘాల్లోని వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. సంక్షేమ శాఖలు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి సంబంధించిన ఆర్డర్‌ను సైతం టెస్కోకు ఇప్పటికీ ఇవ్వకపోవడం కార్మికులను సంక్షోభంలోకి నెట్టివేయడమేనని పేర్కొన్నారు. గడువు ముగిసినప్పటికీ టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా ఆ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులకు ఈ ఆర్డర్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. చేనేత కార్మికులకు అన్యాయం చేసే ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేదంటే కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Next Story