దూకుడు పెంచిన జూపల్లి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్తా చాటేలా భారీ స్కెచ్!

by Disha Web Desk 4 |
దూకుడు పెంచిన జూపల్లి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్తా చాటేలా భారీ స్కెచ్!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మంత్రిగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ నేతగా బిజీ బిజీగా జూపల్లి గడిపారు. 2018 ఎన్నికల ఓటమి తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గానికే పరిమితమై ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఎట్టకేలకు మళ్లీ బిజీ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందడం, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం జూపల్లి కృష్ణారావుకు ఇబ్బందులు మొదలయ్యాయి.

బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఏమాత్రం జంకకుండా తనదైన స్టైల్‌లో నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ అధికార పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తన వర్గీయులను గెలుపించుకొని తన పట్టును నిలుపుకున్నాడు. కానీ అధిష్టానం సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పార్టీ మారే విషయంలో ఆచితూచి అడుగులు వేసి.. చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధం కావడంతో ఆయన అనుచరుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఇటీవలే రాహుల్ గాంధీని కలిసి వచ్చి పార్టీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసిన జూపల్లి కృష్ణారావు ఒక్కసారిగా బిజీ అయ్యారు.

హైదరాబాద్ లోనే ఉంటూ వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విరామం లేకుండా చర్చలు జరుపుతూ తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్య నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ల ఇండ్లకు వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి,వనపర్తి జిల్లా కు చెందిన ఎంపీపీలు మెగారెడ్డి, కిచ్చా రెడ్డి, తదితరులు తనతో పాటు పార్టీలో చేరే విధంగా ఒప్పించడంలో కీలకపాత్ర పోషించారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా కృషి చేశారు.

వరుసగా భేటీలు

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఇతర పార్టీలలో ఉన్న ముఖ్య నేతలు, అసంతృప్త వాదులను పార్టీలోకి ఆహ్వానించేందుకు జూపల్లి కృష్ణారావు చర్చలు జరుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా చెందిన బీజేపీ మరో ముఖ్య నాయకుడితోను జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ మంత్రి మరికొంతమంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతోనూ నిరంతరం చర్చలు జరుపుతూ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దీనితో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాకుండా, ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు సైతం జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరుపుతున్నారు.

ఈనెల 20వ తేదీన కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో కాంగ్రెస్ పార్టీ లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా మాజీ మంత్రి జూపల్లి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఆ సభను దిగ్విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కూడా జూపల్లి ఎప్పటికప్పుడు తన అనుచర వర్గంతో సంప్రదింపులు చేస్తున్నారు. దీనితో ఆయన ఉంటున్న హైదరాబాద్, కొల్లాపూర్ నియోజకవర్గాలలో ఉన్న ఇండ్లు జన సందడిగా మారాయి. మొత్తం పై జూపల్లి మళ్లీ బిజీ బిజీగా మారడంతో ఆయన అనుచర వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.



Next Story

Most Viewed