నిర్లక్ష్యపు వైద్యుడికి ఝలక్..

by Disha Web Desk 11 |
నిర్లక్ష్యపు వైద్యుడికి ఝలక్..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఎడమ కాలికి చేయాల్సిన శస్త్ర చికిత్సను కుడి కాలికి చేసిన ఓ ప్రైవేటు వైద్యుడిపై వేటు పడింది. వైద్యుడి తప్పిదంపై విచారణ జరిపిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆయన పట్టాను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మేడ్చల్ జిల్లా వైద్యారోగ్యధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2021 జూలై 14వ తేదీన ఎడుమ కాలికి ఆపరేషన్ కోసమని మూడు చింతలపల్లి, ఉద్దేమర్రి గ్రామానికి చెందిన జీ సురేశ్ చారి చేరాడు.

అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం మరుసటి రోజు 2021 జూలై 15వ తేదీన అర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కరణ్ ఎం. పటేల్ ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి, ఎడమ కాలికి చేయాల్సిన ఆపరేషన్ ను కుడి కాలికి చేశాడు. జరిగిన పొరపాటును గ్రహించి మళ్లీ 2 రోజుల తర్వాత ఎడమకాలికి శస్త్ర చికిత్స చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడు జి.సురేశ్ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సమగ్ర విచారణ జరిపారు. నివేదికను తెలంగాణ రిజిస్ట్రార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు పంపారు.

అట్టి విచారణ నివేదిక ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ కరణ్ ఎం.పటేల్ డాక్టర్ డిగ్రీ సర్టిఫికేట్ ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజలింగం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యుడు తక్షణమే తన డాక్టర్ డిగ్రీ సర్టిఫికేట్ ను మెడికల్ కౌన్సిల్ లో సమర్పించాలని, 6 నెలల పాటు ఎలాంటి వైద్యం, శస్త్రచికిత్సలు చేయరాదని డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. అలాగే అర్హత లేని వైద్యులు, తప్పుడు డిగ్రీలతో ప్రజలకు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.



Next Story

Most Viewed