పొన్నాలకు షాకిచ్చేలా కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. జనగామ అభ్యర్థిగా తెరపైకి ఎవరు ఊహించని పేరు..?

by Disha Web Desk 19 |
పొన్నాలకు షాకిచ్చేలా కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. జనగామ అభ్యర్థిగా తెరపైకి ఎవరు ఊహించని పేరు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్‌కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. తాజాగా జనగామ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడారు. త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ చూస్తుండటంతో బీఆర్ఎస్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనగామ బరిలో బీసీ మహిళా నేత బాలలక్ష్మి పేరును తెరమీదకు తీసుకువస్తోంది.

బీఆర్ఎస్‌ను ఢిపెన్స్‌లో పెట్టేలా:

తమ సామాజిక వర్గాల వారికి టికెట్లు ఇవ్వడం లేదనే చర్చ అన్ని పార్టీల్లో జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో జనగామ టికెట్‌పై పీఠముడి ఏర్పడింది. ఇక్కడి నుంచి పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు టికెట్ ఆశించారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నాల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే తాను వెళ్తూ వెళ్తూ పార్టీకి డ్యామేజ్ కలిగేలా వ్యవహరించిన పొన్నాలను కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

పొన్నాల ఎత్తుకున్న బీసీ నినాదంతోనే ఆయనకు చెక్ పెట్టాలని యోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జనగామ బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దింపాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదని ఆరోపించిన పొన్నాలను, బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేలా జనగామ రేస్‌లో కాంగ్రెస్ తరపున ఓయూ ఉద్యమకారురాలిగా పేరు ఉన్న బీసీ మహిళా నేత బాలలక్ష్మిని కాంగ్రెస్ రంగంలోకి దింపబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బాలలక్ష్మికి సానుకూల అంశాలు:

ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బాలలక్ష్మికి తెలంగాణ ఉద్యమకారురాలిగా మంచి పేరుంది. విద్యార్థి ఉద్యమకారుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏకైక మహిళా కావడం ఆమెకు ప్లస్ పాయింట్. జనగామ జిల్లా సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించారు. సామాజిక వర్గం కోణంలో చూస్తే బాలలక్ష్మి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాగా, ఆమె భర్త బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక పార్టీ కార్యక్రమాల్లో బాలలక్ష్మి చురుకుగా ఉంటున్నారు.

గతంలో తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల ఇన్ చార్జి బాధ్యతలు ఆమె నిర్వర్తించారు. 2022లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ రిజిస్ట్రేషన్ కోఆర్డినేటర్‌గా పని చేయగా 54,500 మెంబర్ షిప్‌ల నమోదుతో తుంగతుర్తి సెగ్మెంట్‌ను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే టాప్‌లో ఉంచి బాలలక్ష్మి రికార్డు సాధించారు. దీంతో పాటు 2014 నుంచి పార్టీ అప్పగించిన పనులను అంకింత భావంతో ముందుకు తీసుకువెళ్తూ యాక్టివ్‌గా ఉండటం తన గెలుపు సానుకూల అశంగా ఆమె భావిస్తున్నారు.

Next Story

Most Viewed