వివరాలు లేకుండానే గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ?

by Disha Web Desk 2 |
వివరాలు లేకుండానే గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగుల్లో నమ్మకం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్​ ఉద్యోగాలన్నీ ఆలస్యం కావడం, గ్రూప్​–1 చుట్టూ వివాదాలు అలుముకుని, ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కాలం కావడంతో ఆశల్లో ఊరిస్తున్నారంటూ వ్యతిరేకత సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నియామక సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే, పోస్టుల్లో రూల్స్​ఆఫ్ రిజర్వేషన్లు, రోస్టర్​పాయింట్లు ఖరారు చేయకపోవడం వంటి కారణాలతో శాఖల నుంచి రావడం కూడా ఆలస్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వివరాలు లేకుండానే టీఎస్ పీఎస్సీ బ్రీఫ్ నోటిఫికేషన్ పేరుతో ప్రెస్ నోట్‌ను వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేసింది. గ్రూప్-4 కింద త్వరలో 9168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.

ఇప్పుడు కాదు..!

గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్సీ బ్రీఫ్ నోటిఫికేషన్ గురువారం విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్​సైట్‌లో వెల్లడించారు. ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకు దరఖాస్తులను తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే, వీటికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు అందుబాటులో లేవని పేర్కొంది. భర్తీ ప్రక్రియలో నోటిఫికేషన్​ఇచ్చినప్పుడు రిజర్వేషన్ల ప్రకారం ఎవరికి ఎన్ని పోస్టులు, పే స్కేల్, కమ్యూనిటీ ఎడ్యుకేషన్​వివరాలు, నిబంధనలన్నీ ప్రకటించాల్సి ఉంది. కానీ, గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇవన్నీ ఏమీ ఇవ్వలేదు. శాఖల వారీగా ఖాళీలను ప్రకటించిన టీఎస్​పీఎస్సీ.. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ నెల 23 నుంచి ఈ పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లేదా మే నెలలో గ్రూప్​-4 రాత పరీక్ష ఉంటుందని వెబ్ నోట్‌లో తెలిపారు. ఈ జాబితాలో జూనియర్‌ అసిస్టెంట్‌, వార్డు ఆఫీసర్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

ఒత్తిడితోనే..!

ప్రస్తుతం నిరుద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేక వస్తోంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఇదే విషయం బహిర్గతమైంది. దీంతో ఉద్యోగాల ప్రకటనను ఎరగా వేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే, చాలా ఉద్యోగాల ప్రకటనలు ఆలస్యమవుతుండటంతో.. ప్రభుత్వం ఉన్నపళంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని నియామక సంస్థలకు ఆదేశాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్​పీఎస్సీ ఆదరబాదరగా గ్రూప్​ –4 బ్రీఫ్​ నోటిఫికేషన్​ ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది. రిజర్వేషన్లు తేల్చడంపై ఇంకా కొన్ని శాఖలు సాగదీస్తున్నాయి. దీంతో ముందుగా బ్రీఫ్​నోటిఫికేషన్​ ఇచ్చి, ఆ తర్వాత వివరాలను ప్రకటించేందుకు టీఎస్​పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.






Next Story

Most Viewed