ప్రచారంలో కనిపించని కమలం నేతలు...

by Disha Web Desk 11 |
ప్రచారంలో కనిపించని కమలం నేతలు...
X

దిశ, నల్గొండ బ్యూరో : ప్రధాని మోడీ చరిష్మా, కొన్ని వందల సంవత్సరాల చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మాణం వల్ల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే భావనలో కమలం నేతలు ఉన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో బూతు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు చాలా మంది నేతల్లో అసంతృప్తి వైరాగ్యం కనిపిస్తుంది. ఆశించినంత చురుకుగా పని చేయట్లేదని స్పష్టంగా తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో సీనియర్ నేతలు పూర్తిగా ప్రచారానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.

ప్రచారానికి దూరంగా సీనియర్ నేతలు....

తెలంగాణలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు దక్కించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కానీ ఆ మేరకు భువనగిరి పార్లమెంటు స్థానంలో క్షేత్ర స్థాయిలో పని జరగట్లేదని తెలుస్తుంది. ఏ నాయకుడు కూడా ప్రచార బాధితులను భుజాన వేసుకొని నడిపించే పరిస్థితిలో లేదు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా కరీంనగర్ లో పనిచేస్తూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. చౌటుప్పల్ మండలం లో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు ఇంతవరకు ప్రచారలో పాల్గొన లేదని సమాచారం.

బీబీనగర్ మండలానికి పార్టీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి అసలు నియోజకవర్గంలో కంటికి కూడ కనిపించట్లేదని సమాచారం. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం అక్కడ పనిచేస్తున్నారని తెలిసింది. సుమారు 7 ఏళ్లుగా భువనగిరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పీవీ శ్యాంసుందర్ రావు పదవి నుంచి తొలగించిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ భాగస్వామ్యం లేదని, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్ల నర్సింగ్ రావు కూడా ఎన్నికల ప్రచారంలో లేకుండా దూరంగా ఉంటున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ఆలేరు నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు రాఘవులు నరేందర్ కూడా పార్లమెంటు ఎన్నికలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కడియం రామచంద్రయ్య కూడా నామమాత్రంగానే పాల్గొంటున్నట్లు సమాచారం. నకిరేకల్ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, రామన్నపేట మండలానికి చెందిన మాజీ యువమోర్చా నాయకుడు, చిట్యాల మండలంలో కొంతమంది సీనియర్ నేతలు కట్టంగూర్ నకిరేకల్ కేతపల్లి సంబంధించిన పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రచారంలో లేరని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నకరికల్లు నియోజకవర్గం రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి సొంత మండలం కట్టంగూరు అయినప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ప్రచారం చేసిన సందర్భం లేదనిపిస్తోంది..

బూత్ స్థాయిలోనే అసంతృప్తి....

బిజెపి పార్టీకి బలమైన పునాది క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి కమిటీ. ప్రతి బూత్ స్థాయి కమిటీలో సుమారు 22 మంది సభ్యులు ఉంటారు. అయితే భువనగిరి పార్లమెంటులో దాదాపు 2వేల వరకు బూత్ లు ఉంటాయి. ఈ లెక్కన సుమారు 4,000 మంది కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఈ కమిటీల్లో ఉంటారు. వీళ్లే ఓటర్లను పోలింగ్ స్టేషన్ వరకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్లు. ఇదిలా ఉంటే భువనగిరి జిల్లా బీజేపీ నూతన కమిటీ ఏర్పడిన తర్వాత బూత్ కమిటీలను పూర్తిగా రద్దు చేసి ప్రతి బూతుకు కేవలం ముగ్గురు చొప్పున కమిటీ వేసినట్లు సమాచారం. దీంతో గత ఆనవాయితీ కి వ్యతిరేకంగా కమిటీ నిర్మాణం చేయడం ఏంటని ప్రశ్నిస్తూ.. బూత్ స్థాయి లో పనిచేసే కార్యకర్తలు తీవ్రమైన నిరాశలో ఉన్నారని, వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం. ఒకవేళ వీళ్లే క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే బీజేపీ పార్టీకి భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.

క్యాస్ట్ ఈక్వేషన్ లో.....

బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీననీ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు రెండు లక్షల ఉన్నాయనే పేరుతో పార్టీ టికెట్ దక్కించుకున్నాడని చర్చ సాగుతోంది. గౌడ కులస్థులంతా తనకే ఓట్లు వేస్తారని అభ్యర్థి మనసులో ఉంది. కానీ అది లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని అభిప్రాయం కూడా వినబడుతుంది. సామాజిక వర్గం తన అభివృద్ధి కోసం పనిచేస్తే మిగతా సామాజిక వర్గాలు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల కోసం పని చేసే అవకాశం ఉంటుంది. దీంతో సొంత పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు కూడా ఓట్లు వేయడానికి ఆలోచిస్తారని అభిప్రాయం ఉంది. ఏమైనా అభ్యర్థి నియోజకవర్గంలో కులానికే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపణలు ఉన్నాయి . లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని చర్చ నడుస్తోంది.

మౌనంగా సంకినేని.....?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన బిజెపి నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు. ఆయన గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా పని చేశారు. సూర్య పేటలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు బలమైన క్యాడర్ కలిగిన నాయకుడు. అయితే గత కొద్ది రోజుల క్రితం భువనగిరిలో పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లలో ఎక్కడ కూడా సంకినేని పేరు కానీ, ఫోటో కూడా లేకపోవడంతో ఆయన కొంత ఇబ్బంది పడినట్లు సమాచారం. సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గోల కూడా చేశారని సమాచారం. అంతేకాకుండా జిల్లాలో జరుగుతున్న పార్టీ చేరికల్లో తన ప్రమేయం లేకుండానే కొన్ని చేసేస్తున్నారని, ఇదీ తనకు అవమానమేననీ భావిస్తూ సంకినేని నామ మాత్రంగానే ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎంత చరిష్మా ఉన్న, ఎన్ని తీరని కోరికలు తీరినప్పటికీ గెలుపు సునాయాసం అని భావిస్తే అభ్యర్థులు పప్పులో కాలేసినట్టే...



Next Story

Most Viewed