రాబోయే ఎన్నికల్లో సీఎం పైనే నా పోటీ: గద్దర్

by Disha Web Desk 11 |
రాబోయే ఎన్నికల్లో సీఎం పైనే  నా పోటీ: గద్దర్
X

దిశ, అచ్చంపేట: రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యర్థిగా పోటీలో నిలబడతానని ప్రజా యుద్ధనౌక గద్దర్ స్పష్టం చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో అమ్రాబాద్ మండల అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు ఎల్లా స్వామి అధ్యక్షతన అటవీ శాఖ విజ్ఞాన కేంద్రంలో ‘భారత రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై చర్చ వేదిక’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని, ఆనాడు తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం అని పోరాటం చేశారని, నేడు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దక్కుతుందని సత్యంతో ఈ పోరాటానికి సిద్ధమయ్యారని ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పైనే పోటీ..

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సీఎం కేసీఆర్ పైనే పోటీలో నిలబడుతున్నానని స్పష్టం చేస్తూ మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తొమ్మిది ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలల్లో ఎస్సీ ఎస్టీలకు సీఎం పీఠం ఇస్తానని చెప్పి.. ఇవ్వాల్సిన రాజ్యాధికారం ఇవ్వకుండా మోసం చేసారా లేదా అని సూటిగా ప్రశ్నించారు.

ఈ దేశాన్ని కార్పొరేట్ కు..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా దేశ సంపద కార్పొరేట్ కంపెనీలకు, పెద్ద కులాలకు అప్పనంగా కట్టపెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమ ఓటును అమ్ముకోకుండా రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటు వేయాలని సూచించారు. మతం పేరుతో మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య కుంపటి పెడుతున్న ఈ పాలకుల ఆట కట్టించాలంటే బహుజన రాజ్యం కోసం కలిసి పోరాటం చేయాలన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన సనాతన విధానాన్ని అవలంభించాలన్నారు. బానిసలారా లేoడి రా.. మన బతుకులు మార్చే భారత రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో కలిసి ముందుకు వెళ్దామని, రాజకీయ చైతన్యం ప్రతి ఒక్కరికి అవసరమని గుర్తు చేశారు. దంచుడు కొట్టుడు నరుకుడు కాకుండా ఆచరణాత్మక తీర్మానాలతో రాజ్యాధికారం దిశగా అందరం నడుద్దామని పిలుపునిచ్చారు. అలాగే ఆదివారం అమ్రాబాద్ మండల కేంద్రంలో సభ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంద మల్లికార్జున్, కాశీం, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజన్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, సీనియర్ జర్నలిస్టు అంజయ్య, నాసరయ్య, మంతటి పర్వతాలు, కళాకారులు గోపాల్, మురళి, పార్వతమ్మ, మోహన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed