పంతానికి పోయి దయచేసి ఎన్టీఆర్ పరువు తీయకండి!

by Disha Web Desk 2 |
పంతానికి పోయి దయచేసి ఎన్టీఆర్ పరువు తీయకండి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంతానికి పోయి.. సీనియర్ ఎన్టీఆర్ పరువును తీయొద్దని విశ్వహిందూ పరిషత్ నేతలు అన్నారు. ఖమ్మం నగరంలోని లక్కారం చెరువులో ప్రతిష్టించనున్న నందమూరి తారక రామారావు విగ్రహం సహజసిద్ధ రూపంలో లేకపోవడం బాధాకరమని వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సహజసిద్ధమైన పంచె కట్టు, తలపాగతో తెలుగుతనం ఉట్టిపడే తేజస్సు నందమూరి సొంతమని, అలాంటిది ఆయనకు నెమలి పించం, పిల్లనగ్రోవి, నీలిరంగు తొలగించి, అటు కృష్ణుడు కాక.. ఇటు సహజ సిద్ధమైన రూపంకాకపోవడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ గౌరవాన్ని పెంచాలనుకుంటున్నారా? లేక తగ్గించాలనుకుంటున్నారా అని వారు నిర్వాహకులను ప్రశ్నించారు.

తెలంగాణ రాజకీయాల కోసం తెలుగు ప్రజల అభిమాన నటుడిని బలి చేయొద్దని ఆయన హెచ్చరించారు. మంత్రి పువ్వాడ అజయ్ గందరగోళం నెలకొల్పడం సరికాదని ఆయన సూచించారు. ఈ గందరగోళంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉందని, మరి ఎన్టీఆర్ జయంతి, వర్ధంతికి నివాళులర్పిస్తారా? లేదా శ్రీకృష్ణుడిని కొలుస్తారా? అనేది స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవతల విగ్రహాలు, రాజకీయ నేతల విగ్రహాలకు సంబంధించిన అంశంపై పద్ధతులు, నిబంధనలు పాటించాలని ఆయన హెచ్చరించారు.



Next Story

Most Viewed