ముచ్చటగా మూడోసారి.. నేడు ఓరుగల్లుకు సీఎం రేవంత్​రెడ్డి

by Disha Web Desk 4 |
ముచ్చటగా మూడోసారి.. నేడు ఓరుగల్లుకు సీఎం రేవంత్​రెడ్డి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : పార్లమెంట‌రీ ఎన్నిక‌ల ప్రచారం తార‌స్థాయికి చేరుకుంది. గ‌డువు సమీపిస్తుండ‌టంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. వ‌రంగ‌ల్ పార్లమెంట‌రీ ప‌రిధిలో రెండు భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చట‌గా మూడోసారి వ‌రంగ‌ల్ తూర్పు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే రోడ్ షో, కార్నర్ మీటింగ్‌ల్లో మంగ‌ళ‌వారం పాల్గొన‌నున్నారు. అలాగే వ‌రంగ‌ల్ లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఈనెల 8న ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ ప‌ట్టణానికి రానున్నారు. ఖిలావ‌రంగ‌ల్ మండ‌లంలోని ల‌క్ష్మీపురంలో జ‌రిగే బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ గ‌తంలో ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్సవం సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో ప‌ర్యటించ‌గా, తాజాగా ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొంటుండ‌టం గ‌మ‌నార్హం. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ప్రధాన‌మంత్రి హోదాలో ఉన్న నేత వ‌రంగ‌ల్‌లో ప‌ర్యట‌న‌కు వ‌స్తుండ‌టం ఇదే తొలి సారి కావ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ, కాంగ్రెస్‌ల ముమ్మరం ప్రచారం..

బీఆర్ఎస్ పార్టీలో కీల‌క నేత‌గా కొన‌సాగిన‌ స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి త‌న కూతురు క‌డియం కావ్యతో క‌లిసి కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. క‌డియం కావ్యకు బీఆర్ ఎస్ నుంచి ఎంపీ టికెట్ ప్రక‌టించాక‌ క‌డియం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోకి రావాల‌ని క‌డియం శ్రీహ‌రిని తానే అడిగానంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ‌డికొండ‌లో జ‌రిగిన కాంగ్రెస్ జ‌న‌జాత‌ర స‌భ‌లో స్పష్టం చేశారు. పార్టీకి క‌డియం శ్రీహ‌రి ద్రోహం చేశార‌ని భావిస్తున్న బీఆర్ఎస్ అగ్ర నాయ‌క‌త్వం, క్యాడ‌ర్‌, బీజేపీ గెలుపున‌కు ప‌రోక్షంగా సాయం చేసేందుకే ఎత్తులు వేస్తోంద‌న్న విశ్లేష‌ణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. సుధీర్‌కుమార్ గెలుపున‌కు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ ఎస్ నాయ‌క‌త్వం సైతం ప్రచారం చేయ‌డం లేద‌ని గుర్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య పోరు ఉంటుంద‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల అగ్ర నాయ‌క‌త్వాలు వ‌రంగ‌ల్‌ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి.

బీజేపీలో ఆశ‌లు..ప్రతిష్టగా రేవంత్‌..!

వ‌రంగ‌ల్ పార్లమెంట‌రీ ప‌రిధిలో ఈ సారి గెలుపున‌కు అవ‌కాశాలున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు బ‌లంగా న‌మ్ముతున్నాయి. ఈనేప‌థ్యంలో ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వాన్ని వ‌రంగ‌ల్ పార్లమెంట‌రీ ప‌రిధిలో ప్రచారం ఉధృతం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, కేంద్రమంత్రులతో పాటు జాతీయ స్థాయి నేత‌లు రోజూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈనెల 8న వ‌రంగ‌ల్‌లో నిర్వహిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ‌తో బ‌ల ప్రద‌ర్శ‌న చేయాల‌ని భావిస్తోంది. ఇందుకోసం భారీ వేదిక‌ను, ప్రాంగ‌ణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక వ‌రంగ‌ల్ లోక్‌స‌భ స్థానం నుంచి ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల‌ని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పాట్లు ప‌డుతున్నారు. వ‌రంగ‌ల్ పార్లమెంట‌రీ ప‌రిధిలోని వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌డికొండ‌లో జ‌రిగిన జ‌న‌జాత‌ర బ‌హిరంగ స‌భ‌లో, భూపాల‌ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని రేగొండ మండ‌లకేంద్రంలో జ‌రిగిన స‌భ‌ల్లోనూ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని క్యాడ‌ర్‌కు దిశానిర్దేశం, ప్రజ‌ల‌కు పార్టీ మేనిఫెస్టో, సందేశం ఇచ్చారు. తాజాగా మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ తూర్పు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే రోడ్ షోల్లో పాల్గొన‌నున్నారు. వ‌రంగ‌ల్ లోక్‌స‌భ ప‌రిధిలో సీఎం స్థాయి నేత మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండ‌టం ఇదే తొలిసారంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. క‌డియం కావ్య గెలుపును రేవంత్‌రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Next Story

Most Viewed