దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం : డాక్టర్ పిడమర్తి రవి

by Disha Web Desk 15 |
దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం : డాక్టర్ పిడమర్తి రవి
X

దిశ, సికింద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి చెప్పారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటి పైకి వచ్చి నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబ దోపిడీకి గురై అప్పుల రాష్ట్రంగా మిగిలిందని మండిపడ్డారు. కేసీఆర్​తో దగా పడ్డ తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. అనంతరం ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ మిడతనపల్లి విజయ్ మాట్లాడుతూ బతుకు తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటుంటే, బార్ల తెలంగాణగా మార్చారని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దశాబ్ది ఉత్సవాలను విరమించుకొని ప్రగతి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలన్నారు. జూన్ 2న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని తెలిపారు. త్వరలో విద్యార్థి గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించి కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, ఓయూ జేఏసీ నాయకులు దాత్రిక స్వప్న, ఆజాద్, ఈశ్వర్ నాయక్, దేవేందర్ నాయక్, పద్మ, గిరిజన మహాశక్తి స్టేట్ ప్రెసిడెంట్ చందర్ నాయక్, మాదిగ జేఏసీ స్టేట్ సెక్రటరీ జెస్సీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ యాదవ్, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం దశరథ నాయక్, బీఎస్ఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం.ప్రసాద్, నక్క మహేష్, గణేష్, నరేష్, కిరణ్, రేవంత్, టీబీఆర్ఎస్ అధ్యక్షులు బొమ్మెర స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed