హైదరాబాద్ జిల్లా డీఈఓకు షోకాజ్ నోటీసులు జారీ

by Aamani |
హైదరాబాద్ జిల్లా డీఈఓకు షోకాజ్ నోటీసులు జారీ
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ స్థాయి అధికారి , ఉద్యోగినైనా ఉపేక్షించేది లేదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిరూపించారు . రాష్ట్ర రాజధానిలో కలెక్టర్ గా పని చేస్తున్న ఆయనకు నిక్కచ్చిగా వ్యవహరించే జిల్లా ఉన్నతాధికారి గా గుర్తింపు ఉంది. విధి నిర్వహణలో క్రమశిక్షణ గల నిక్కచ్చి అధికారిగా తాను పని చేస్తే ఇతర అధికారులు,సిబ్బంది కూడా విధులు నిర్వహించాలనే నిబద్ధత కలిగిన వారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే సమర్ధుడైన యువ కలెక్టర్ గా అటు ప్రభుత్వంలో , ఇటు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు . ఈ నేపథ్యంలోనే పలువురు విద్యాశాఖ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది .

డీఈఓ తో సహా పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు...

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డీఈఓ రోహిణి తో సహా ఇతర విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు . ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చర్యలు తీసుకోవడం అధికాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరికలు పంపారు . జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిరంతరం సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేయడం వంటివి ఆయన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్నారు.

ఈ క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఏకంగా జిల్లా విద్యాశాఖాధికారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం విధుల పట్ల నిబద్ధత లేని అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి . అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం , విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ ల కుట్టడం పనుల పురోగతి వంటి అంశాలను పట్టించుకోలేదనే కారణంగా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రోహిణి, ఇంచార్జ్ డిఇఓ, అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీనివాస్, బహదూర్ పుర డిప్యూటీ డీఈవో లకు ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేయడం విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించి నట్టైంది .

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఆర్వోగా ...

ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికలలో హైదరాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు . ఈ క్రమంలో నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఎన్నికలు ముగిసేంత వరకు ఆయన చేసిన మానిటరింగ్ కారణంగా హైదరాబాద్ సెగ్మెంట్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పలు సమస్యాత్మక ప్రాంతాలున్న పాతబస్తీలో ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ ముగించడం లో ఆర్వోగా ఆయన పాత్ర కీలకంగా మారింది. అధికార యంత్రాంగంతో సక్రమంగా పని చేయిస్తూ ముందుకు సాగుతున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మరింత ఉన్నతమైన పదవులు అలంకరిస్తే ప్రజా సమస్యలు తీరుతాయనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

Next Story

Most Viewed