అకాల వర్షాలతో మళ్లీ ఆగమేనా..? మూడు రోజులు సిటీకి ఆరెంజ్ అలర్ట్

by Disha Web Desk 7 |
అకాల వర్షాలతో మళ్లీ ఆగమేనా..? మూడు రోజులు సిటీకి ఆరెంజ్ అలర్ట్
X

దిశ, సిటీబ్యూరో : మహానగరానికి మళ్లీ అకాల వాన కష్టాలు మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఈసారి అకాల వర్షాలు కాస్త ముందుగానే వచ్చాయి. గురువారం నుంచి రానున్న మూడురోజుల పాటు నగరంలోని ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాముందని సూచిస్తూ, ఆరెంజ్ అలర్ట్ చేసింది. గురువారం మధ్యాహ్నాం మూడు గంటల నుంచే నగరంలో జల్లులు కురిశాయి.

సాయంత్రం ఆరున్నర గంటలకు ఓ మోస్తారుగా వర్షం కురవటంతో రద్దీ మెయిన్ రోడ్లు, జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ అయింది. ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణ శాఖ సూచించినట్టు భారీ వర్షాలు కురిస్తే, మళ్లీ ఏప్రాంతం జలదిగ్భందమవుతుందోనంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముంపు నివారణ పనులకు అడ్డుంకులెన్నో

హైదరాబాద్ మహానగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు రెండేళ్ల క్రితం ఎండాకాలంలో కురిసిన అకాల వర్షాలకు పలు ప్రాంతాలు నీటిలో మునిగినప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక, చెరువులకు దిగువన ఉన్న ప్రాంతాల్లో ముంపు నివారణ పనులు చేపట్టేందుకు స్ట్రాటెజికల్ నాలా డెవలప్‌మెంట్ ప్రొగ్రాం(ఎస్‌ఎన్‌డీపీ) కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన సంగతి తెల్సిందే. ఏకంగా రూ.958 కోట్లతో మొత్తం 60 పనులకు మంజూరీ ఇవ్వగా, ఇందులో 33 పనులను గ్రేటర్ పరిధిలో చేపట్టాల్సి ఉంది. మిగిలిన 27 పనులను గ్రేటర్ చుట్టున్న స్థానిక సంస్థల పరిధిలో చేపట్టారు.

కానీ వీటిలో ఇప్పటి వరకు రెండు మాత్రమే పూర్తి కాగా, ఇంకా ప్రారంభించని పనులు, ప్రారంభించిన తర్వాత ఆరంభంలోనే ఆగిన పనులున్నాయి. కేవలం మూడు నెలల్లో పనులన్నీ పూర్తి చేస్తామన్న అధికారులు ఇప్పటి వరకు కేవలం రెండు పనులను మాత్రమే పూర్తి చేశారు. జీహెచ్ఎంసీలో నిధులు పుష్కలంగా ఉన్నప్పుడు పనులు చేపట్టలేని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు ఖజానా ఖాళీ అయిన తర్వాత ఎస్ఎన్ డీపీ పనులు చేపట్టేందుకు అప్పుల కోసం అన్వేషణ ప్రారంభించారు. కానీ ఎక్కడ అప్పులు పుట్టడం లేదు. జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వం, అకాల, వర్షాకాలంలో ప్రజలపాలిట శాపంగా మారిందన్న విమర్శలున్నాయి.

ఎప్పటికప్పుడు డెడ్ లైన్ల పొడిగింపు

ఎస్ఎన్ డీపీ పనుల నిధులకు సర్కారు పరిపాలనపరమైన మంజూరీ ఇచ్చిన సంవత్సరం తర్వాత చేపట్టిన ఈ పనులను పలు సార్లు సమీక్షించిన మంత్రి కేటీఆర్ కూడా తీవ్రస్థాయిలో అసహానాన్ని వ్యక్తం చేసినా, అధికారులు ఎప్పటికప్పుడు డెడ్ లైన్లను పొడిగిస్తున్నారే తప్పా, పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా, కేవలం రెండు పనులను మాత్రమే పూర్తి చేశారు.

కొద్ది నెలల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు నిలదీయగా డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని ఇంజినీర్ ఇన్ చీఫ్ సమాధానమిచ్చినా, నేటికీ పనులు సగం కూడా పూర్తి కాలేదు. తాజాగా జూన్ కన్నా ముందు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరీ అకాల వర్షాకాలం ముంపు నివారణ సంగతేంటీ అన్న ప్రశ్నకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది.

ఎన్ని అడ్డంకులో?

ముంపు నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో ముఖ్యంగా నల్లకుంట పద్మకాలనీ, రామంతాపూర్‌లోని టీవీ కాలనీతో పాటు ఎల్బీనగర్, చార్మినార్ జోన్ల పరిధిలోకి వచ్చే మలక్‌పేటలోని సంకేశ్వర్ బజార్‌లో పనులు కాస్త చురుకుగానే సాగుతున్నాయి. పద్మకాలనీలో గతగత జూన్‌లో పనులు ప్రారంభించినా, ఆ తర్వాత కురిసిన వర్షానికి కొత్తగా నిర్మించిన బాక్స్ డ్రెయిన్ కొట్టుకుపోయింది. మళ్లీ నిర్మిస్తున్న బాక్స్ డ్రెయిన్ కారణంగా కాలనీవాసులు అరకిలోమీటరు చుట్టూ తిరిగి ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

టీవీ కాలనీలో నాలాలను విస్తరించి నిర్మించే పనులకు భూమిలో పెద్దపెద్ద బండరాళ్లు అడ్డొచ్చాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్ ఆ రాళ్లను తొలగించే పనికే పరిమితమయ్యారు. ఇక సంకేశ్వర్ బజార్‌లోనైతే రోడ్లన్నీ తవ్వి, పనులు చేపడుతున్నారు. ఫలితంగా కాలనీవాసులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ ఇక్కట్లు అకాల వర్షాలతో మరింత రెట్టింపుకానున్నాయి.

Next Story

Most Viewed