- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్ వరల్డ్ ఏర్పాట్లపై మంత్రి జూపల్లి తీవ్ర అసహనం
గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై తెలంగాణ పర్యాటక, ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై తెలంగాణ పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయం దగ్గరపడుతున్నా ఇంకా అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడం పట్ల భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను అడిగి ఏర్పాట్ల గూర్చి తెలుసుకున్నారు. స్వాగత తోరణాలను కార్డు బోర్డులతో కాకుండా తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మామిడి, అరటి ఆకులు, పూలతో ఘనంగా తీర్చిదిద్దాలని సూచించారు. షో బోట్ ఈవెంట్స్ వారు ఏర్పాటు చేస్తున్న వెల్కం ఆర్చులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతికి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏర్పాట్లు చేయవద్దని, వారేదో చూపిస్తే మీరెందుకు వాటికి ఓకే చెబుతున్నారు. తెలంగాణ సంప్రదాయం ఎక్కడా కనిపించడం లేదన్నారు మంత్రి జూపల్లి. భరత నాట్యం, కథక్, పేరిణి నృత్యాలు, సన్నాయి మేళం, భజంత్రీలు, తెలంగాణ కలలు, సాంస్కృతి, హ్యాండ్ క్రాప్ట్స్, చేర్యాల నకిశీలు, గుస్సాడి నృత్యాలు ఇలా ప్రతీ తెలంగాణ సాంప్రదాయం అడుగడుగునా ఉట్టిపడాలని, ప్రపంచ వేదికపై తెలంగాణ వైభవం కనిపించాలని మంత్రి జూపల్లి సూచించారు.
వెల్కం ఆర్చిలో మామిడి తోరణాలు, అరిటాకులు, పూలతో ఏర్పాటు చేయాలని, మిగతా ఏర్పాట్లను ఈనెల 10వ వరకు పూర్తి చేయాలని, ఏర్పాట్లలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేబోమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు తెలంగాణ వైపు తిరిగి చూసేలా.. అందరూ ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. అలాగే శ్రీ మణి ద్వీప ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించనున్న పేరిణి స్వాగత నృత్యం శిక్షణను మంత్రి తిలకించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని, ఉదయం శంషాబాద్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు సూచనలు చేశామని, అక్కడ కూడా ఏర్పాట్లు సాగుతున్నాయని, గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఏర్పాట్లను పరిశీలించామని, పనుల్లో వేగం పెంచాలని మంత్రి అన్నారు. తెలంగాణ సాంప్రదాయం, సంస్ర్కుతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అతిథులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. 10వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సైబరాబాద్ జాయింట్ సీపీ గజరావు భూపాల్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలా, డీఎంహెచ్ ఓ వెంకటేశ్వరరావు, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






