'మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు... ఇప్పుడు మేం కలిసిపోయాం'

by Dishanational1 |
మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు... ఇప్పుడు మేం కలిసిపోయాం
X

దిశ, ముషీరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ లోని సభ్యుల మధ్య ఉన్న విభేదాలు ప్రస్తుతం లేవని, ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం రెండు గ్రూపుల్లోని సభ్యులందరం కలిసిపోయామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు థామస్ రెడ్డి, ఎ.ఆర్. రెడ్డిలు స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీన తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి, ఆ సమావేశంలోనే నూతన కమిటీ ఏర్పాటుతోపాటు భవిష్యత్ కార్యచరణ ఆరోజే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం విద్యానగర్ లోని తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్. కమలాకర్ గౌడ్, ఎల్. మారయ్య, బి. యాదయ్య, జి.పి.ఆర్. రెడ్డి, ఎల్.బి. రెడ్డి, ఎస్.హెచ్.కె. రెడ్డిలతో కలిసి థామస్ రెడ్డి, ఎ.ఆర్.రెడ్డిలు మాట్లాడారు.

తెలంగాణ మజ్దూర్ యూనియన్ తరపున మంత్రులను కలిశామని, మునుగోడు ఉప ఎన్నికలో కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామన్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఉన్న కార్మికులందరూ మేల్కొని యూనియన్ లో మళ్లీ యాక్టీవ్ గా ఉండాలన్నారు. ఆర్టీసీలో యూనియన్లు ఉండాలని అధికారులకు కూడా ఇష్టమే అని, యూనియన్ వస్తే మేనేజ్మెంట్ కే మంచి జరుగుతదన్నారు. యూనియన్లకు అధికారులు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తూ వస్తుందని, కానీ ఆర్టీసీలోని కార్మికులకు రావాల్సిన డీఏలు, బకాయిలు, పీఆర్ సీలు వెంటనే ఇవ్వాలన్నారు. ఏపీలో అమలు చేస్తున్న విధంగా తెలంగాణలో కూడా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ కు ఆర్టీసీ అంటే ప్రేమ ఉందని, బడ్జెట్ అమౌంట్ ను కూడా వెంటనే ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. ఈ సమావేశంలో భద్రం, జి.ఎల్. గౌడ్, బి. నరేందర్, ఇ.ఎస్. బాబు, ఎం.హెచ్. అలీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed