మూసీ పునరుజ్జీవంపై సర్కార్ ఫోకస్.. డీపీఆర్ రెడీ!

by Javid Pasha |

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ఐదు జోన్లలో ఆరు మాస్టర్ ప్లాన్‌లను అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 21కి.మీ మార్గాన్ని డెవలప్ చేయనున్నారు.

మూసీ పునరుజ్జీవంపై సర్కార్ ఫోకస్.. డీపీఆర్ రెడీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల జోన్ అభివృద్దిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ రెడీ అయింది. రెండు మూడు రోజుల్లో ఫైనల్ కానుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పనులు మార్చి31లోగా ప్రారంభించే అవకాశముందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఐదు జోన్లు ఇలా..

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ఐదు జోన్లలో ఆరు మాస్టర్ ప్లాన్‌లను అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.5 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కి.మీ మొత్తం 21కి.మీ మార్గాన్ని డెవలప్ చేయనున్నారు. బాపూఘాట్ వద్ద ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీన్ని పర్యాటక కేంద్రంతోపాటు ఫైనాన్సియల్ హబ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. తర్వాత బాపూఘాట్ నుంచి పురానపూల్ వరకు 6 కి.మీ, పురానపూల్ నుంచి చాదర్ ఘాట్ వరకు 7 కి.మీ, చాదర్ ఘాట్ నుంచి నాగోల్ వరకు 6 కి.మీ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 15 కి.మీ మార్గాల్లో దశలవారీగా డవలప్ చేయాలని నిర్ణయించారు. గండిపేట్ నుంచి గౌరెళ్లి వరకు 55 కి.మీ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 55 కి.మీ మార్గంలో ఐదు ప్రాంతాల్లో ట్రంపెట్ క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆరు మాస్టర్ ప్లాన్లు..

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు ఆరు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. నది ప్రాంతంలో నీటి శ్రేణులు, నదులు, ఇతర జల వనరుల నిర్వహణ, సంరక్షణ కోసం సమగ్రంగా బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్లూ మాస్టర్ ప్లాన్‌కు అనుసంధానంగా గ్రీన్ మాస్టర్ ప్లాన్ సైతం రూపొందించనున్నారు. నది ప్రాంతంలో గ్రీన్ స్పేసెస్, పార్కులు, పర్యావరణ మిత్రమైన ప్రయత్నాల అభివృద్ధి, మెరుగుదల, నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. మూసీ నది 55 కిలోమీటర్ల ప్రాంతంలో వివిధ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. జోనింగ్ నియమాలు, అందుబాటులో ఉన్న భూమిని వివిధ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. మూసీ ప్రాజెక్టులో మార్కీ (ల్యాండ్ మార్క్) ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. మూసీ సమీప ప్రాంతాల్లో టూరిజాన్ని కేంద్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో అవసరమైన ప్రాజెక్టులను రూపొందించడం, ఇందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే లంగర్ హౌస్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనికోసం 200 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ రక్షణ శాఖ మాత్రం 45 ఎకరాల భూమిని ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిసింది.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, నాగోల్‌లో శిల్పారామం, జాతీయ జెండా ఏర్పాటు చేసిన ప్రాంతాలను మార్కీ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దాలని మాస్టర్ ప్లాన్ తయారుచేయనున్నారు. రహదారులు, నీరు, విద్యుత్, నాలాలు, ఇతర ప్రధాన సేవల అభివృద్ధి గురించి వివరించే ప్రణాళికను కూడా తయారు చేయనున్నారు. ఈ ప్రణాళిక, అవసరమైన భౌతిక వసతులను పెంచి, సుస్థిర అభివృద్ధిని, ప్రాంతంలో సమగ్ర కనెక్టివిటీని నిర్ధారించే విధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, భూమి ఉపయోగ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్లతోపాటు ఫైనాన్సియల్ మాస్టర్ ప్లాన్‌ను కూడా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ఎంఆర్డీసీఎల్‌కు ప్రభుత్వం 736 ఎకరాలను కేటాయించింది. ఈ భూముల్లో ఫార్మా, ఐటీ, జీసీసీలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.

మార్చిలో పనులు..

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం ఏసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) రూ.4,100 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సైతం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మార్చిలో మొదటి దశకు సంబంధించిన పనులు ప్రారంభంకానున్నాయని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. దీంతోపాటు నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ (ఎన్ఆర్సీపీ)లో భాగంగా మూసీలోని శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవడానికి రూ.3,188 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర జలశక్తిశాఖకు పంపించారు. ఈ నిధుల కోసం ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

Next Story