మహిళా జర్నలిస్టులకు గుడ్ న్యూస్

by Dishanational1 |
మహిళా జర్నలిస్టులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం సీఎస్​శాంతికుమారి ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్​మాట్లాడుతూ...మహిళా జర్నలిస్టులకు దాదాపు 56 రకాల పారామీటర్లు, 12 పరీక్షలు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా నిర్వహిస్తామన్నారు. ఇందుకు గాను సమాచార శాఖ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ ను కోరారు. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్టు సీఎస్​వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, మహిళా జర్నలిస్టులకు కాంప్రహెన్సివ్ హెల్త్ చెకఫ్ లతోపాటు ఎన్నో విప్లవాత్మక పథకాలతో రాష్ట్ర ప్రజల ఆరోగ్య, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు.


రాష్ట్రంలో ఇప్పటివరకు 13,28,808 మందికి కేసీఆర్ కిట్ లను అందజేశామని, తద్వారా 29.10 లక్షల మంది లబ్ది పొందారని తెలియచేసారు. ఈ కేసీఆర్ కిట్ లను ఉచితంగా ప్రారంభించినప్పటినుండి రాష్ట్రంలో సంస్థాగత ప్రసవాలు అధికం అయ్యాయని అన్నారు. ప్రస్తుతం 95 శాతం ప్రసవాలు సంస్థాగతంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుండి 61 శాతానికి పెరిగాయని తెలిపారు. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ప్రసవాలను జరిపితే ప్రోత్సాహక పురస్కారాలను కూడా సిబ్బందికి అందిస్తున్నామని చెప్పారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేసేందుకు గాను రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, ఈ కిట్ ల వల్ల మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని అన్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ కేసీఆర్ న్యూట్రిషన్ ఫుడ్ కిట్ లను అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నామని వెల్లడించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 5214 మంది మహిళలకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రతీ మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమం క్రింద వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని రాష్ట్రంలోని మహిళలకు సీఎస్ శాంతి కుమారి సూచించారు. దాదాపు 57 రకాల పాథాలజికల్ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకై రాష్ట్రంలోని హైదరాబాద్ తోపాటు 22 జిల్లాలో ప్రారంభించిన తెలంగాణా డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 49 లక్షల మందికి 8 .90 కోట్ల పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. దాదాపు రెండు కోట్ల మంది ప్రజలకు తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రవేశపెట్టిన 352 బస్తీ దవాఖానాల ద్వారా ఇప్పటివరకు కోటి 14 లక్షల మందికి ఓపీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. మరో 46 బస్తీ దవాఖానాలు త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస్, ఓ.ఎస్.డి డా. గంగాధర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.



Next Story

Most Viewed