ఫార్ములా ఈ - రేసింగ్ ఎఫెక్ట్.. నగరంలో ఫుల్ ట్రాఫిక్ జామ్

by Dishanational2 |
ఫార్ములా ఈ - రేసింగ్ ఎఫెక్ట్.. నగరంలో ఫుల్ ట్రాఫిక్ జామ్
X

దిశ, సిటీ బ్యూరో : ఫార్ములా ఈ- రేసింగ్ హైదరాబాద్ జనాలకు నరకయాతన చూపించింది. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ లే కనిపించాయి. సిటీ సెంటర్ లోని రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. క్లియర్ కావడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 7వ తేదీ నుంచి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యూ టర్న్ లను కూడా మూసివేయడంతో అష్టకష్టాలు పడ్డారు.

కిలోమీటర్ల మేర జామ్..

ఈ రేసింగ్ కోసం ఎన్టీఆర్ గార్డెన్స్ చుట్టూ 2.8 కి.మీ పొడువునా స్ట్రీట్ ట్రాక్ ను ఏర్పాటు చేసి నిర్వాహకులకు అప్పగించారు. జాతీయ, అంతర్జాతీయ రైడర్లు పాల్గొంటుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే నిర్వాహకులు, పోలీసుల అత్యుత్సాహంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మింట్ కాంపౌండ్ నుంచి ప్రసాద్ ఐ మాక్స్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించలేదు. దీంతో ఖైరతాబాద్ రైల్వే క్రాసింగ్ మీదుగా లక్డీకాపూల్ వెళ్లేందుకు వచ్చి, క్రాసింగ్ వద్ద భారీగా జామ్ అయ్యాయి. ఆంక్షలు అమలు చేస్తున్నామని చెప్పే పోలీసులు ప్రత్యామ్నాయాలను చూపకపోవడం, మెయిన్ రోడ్లలోని యూ టర్న్ లను సైతం మూసివేయటంతో సమస్య మరింత తీవ్రమైంది. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం సర్కిల్, ఇక్బాల్ మినార్, మింట్ కాంపౌండ్, సంత్ నిరంకారి భవన్ జంక్షన్ నుంచి ఖైరతాబాద్ జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లక్డీకాపూల్ జంక్షన్ లో ఏర్పడిన జామ్ కారణంగా అటు మహావీర్ ఆస్పత్రి వరకు, ఇటు ట్యాంక్ బండ్ జంక్షన్ వరకు, లక్డీకాపూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇందులో అంబులెన్స్ లు కూడా ఉండడం గమనార్హం.

ప్రజల్లో తీవ్ర ఆగ్రహం

ట్రాఫిక్ జామ్ లపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో సహనం కోల్పోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు సైతం వచ్చాయి. చింతల్ బస్తీలోని పలు కూడళ్లు, ఖైరతాబాద్ మార్కెట్, రైల్వే క్రాసింగ్, రీగల్ టాకీస్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో గొడవలు జరిగినట్టు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులు కూడా లేకపోవడంతో ప్రజలు మండిపడ్డారు.

Next Story

Most Viewed