కలెక్షన్ స్టాప్‌కు ఎలక్షన్ డ్యూటీ.. గణనీయంగా తగ్గుతున్న ప్రాపర్టీ ట్యాక్స్!

by Disha Web Desk 19 |
కలెక్షన్ స్టాప్‌కు ఎలక్షన్ డ్యూటీ.. గణనీయంగా తగ్గుతున్న ప్రాపర్టీ ట్యాక్స్!
X

దిశ, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థికవనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన ట్యాక్స్ సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీలు కేటాయించటంతో కలెక్షన్ గణనీయంగా తగ్గుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు సుమారు 300 మంది బిల్ కలెక్టర్లు, మరో 140 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లున్నారు. వీరంత క్షేత్రస్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్‌ను వసూలు చేయాల్సి ఉండగా, వీరంత ఇప్పుడు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రిపీటెడ్‌గా ఉన్న ఓట్లను తొలగించే బాధ్యతను వీరికి అప్పగించారు. వీరంత తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇంటింటికెళ్లి ఓటర్ల వివరాలను వెరిఫై చేసి, ఎక్కడైన ఓటు రిపీట్ అయిందన్న అనుమానం వస్తే సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది.

కానీ 2022-23లో టార్గెట్‌గా పెట్టుకున్న రూ.2 వేల కోట్లకు కేవలం రూ.1,681 కోట్లు మాత్రమే వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్‌లో ఎర్లీబర్డ్ అమలు చేసి రూ.751 కోట్ల పన్నులు వసూలు చేసుకున్న జీహెచ్ఎంసీ మేలో నైనా కలెక్షన్ పెంచుకోవాలని భావించింది. కానీ అంతలోనే ట్యాక్స్ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ట్యాక్స్ సిబ్బంది అంతా రిపీట్ ఓట్లను గుర్తించే పనిలో ఉన్నారు. కానీ ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన తమతో రకరకాల పనులు చేయిస్తున్నారని వారు వాపోతున్నారు.

తగ్గిన కలెక్షన్..

ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కన్నా ఎన్నికల విధులే ముఖ్యమని అధికారులు తేల్చి చెప్పటంతో రోజువారీగా జరిగే కలెక్షన్ కూడా గణనీయంగా తగ్గినట్లు సమాచారం. మే నుంచి అక్టోబర్ వరకు సాధారణ రోజుల్లో ఆస్తి పన్ను కలెక్షన్ ఒక్కో రోజు రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య వసూలవుతుంది. కానీ గతఆర్థిక సంవత్సరం కలెక్షన్ హడావుడి, ఆ తర్వాత వచ్చిన ఎర్లీబర్డ్ కలెక్షన్ తర్వాత ఎలాంటి హడావుడి లేని రోజుల్లో సైతం రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు కలెక్షన్ అయ్యేదని, అన్ని రకాల ఆఫర్లు ముగిసిన తర్వాత ప్రస్తుతం రోజుకు కేవలం రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు మాత్రమే ఆస్తిపన్ను వసూలవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, క్షేత్రస్థాయి విధులు నిర్వహిస్తున్న ట్యాక్స్ స్టాఫ్‌కు పెట్రోల్ కోటా కూడా ఇస్తున్నందున ప్రతిరోజు రిపీట్ ఓట్లను గుర్తించేందుకు విజిట్ చేయాల్సిన ఇళ్ల సంఖ్యను కూడా ఇవ్వటంతో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది బేజారవుతున్నారు.



Next Story