అభ్యర్థుల వ్యయంపై ఈసీ డేగ కన్ను

by Disha Web Desk 12 |
అభ్యర్థుల వ్యయంపై ఈసీ డేగ కన్ను
X

దిశ, సిటీబ్యూరో: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఈసీ అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులను పంపిణీ చేయకుండా అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్‌కు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువుల పంపిణీకి బ్రేక్ వేసేందుకు నగరం చుట్టూ 16 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి తొమ్మిది ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీములను కేటాయించింది. అభ్యర్థుల ప్రచారం కీలక ఘట్టానికి చేరడంతో టీముల సంఖ్యను ఈసీ పెంచింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 135 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 135 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీములను నియమించింది.

ఈ టీముల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.22 కోట్ల పైచిలుకు నగదు స్వాధీనం చేసుకుంది. ప్రచారం కీలక దశకు చేరుకోవడంతో అభ్యర్థులు భారీగా నగదు మద్యం పంపిణీ చేసే అవకాశాలున్నట్లు సమాచారాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు అదనంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, మరో మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీములను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి తోడు అభ్యర్థుల ప్రచారం వెనుక షాడో టీంలు వీడియో చిత్రీకరణ చేస్తూ అభ్యర్థి భయాన్ని అంచనాలు వేస్తూ అభ్యర్థి ఖర్చు చేస్తున్న వ్యయాన్ని లెక్కిస్తున్నారు. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఇద్దరు పరిశీలకులు రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల్లో..

పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ప్రచారంలో నగదు, మద్యం, విలువైన వస్తువుల పంపిణీలకు బ్రేక్ వేసేందుకు నగరం చుట్టూ ఏర్పాటు చేసిన 16 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల్లో పోలీసులతోపాటు సాయుధ బలగాలు, ఆదాయపన్ను శాఖ అధికారులు పోలింగ్‌కు ఒక రోజు ముందు 12వ తేదీ వరకు తనిఖీలు చేస్తున్నారు.

Next Story