కేంద్ర బడ్జెట్ ప్రతుల దహనం

by Disha Web Desk 15 |
కేంద్ర బడ్జెట్ ప్రతుల  దహనం
X

దిశ, ముషీరాబాద్ : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు అన్నారు. తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కోత విధించడం దుర్మార్గం అని అన్నారు. 2023-24లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి రూ.1,15,531.79 కోట్లు కేటాయించిందని, ఇందులో వ్యవసాయానికి రూ.71,378 కోట్లు మాత్రమే కేటాయించి మిగిలిన నిధులు పథకాలకు కేటాయించిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్‌లో 3.2 శాతం మాత్రమే కేటాయింపులు చూపారని తెలిపారు.

బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సందర్భంలో 2023-24 సంవత్సరానికి పంట రుణాల కింద 18 లక్షల కోట్లు రుణాలు ఇస్తామని ప్రకటించారని, గతంలో 16 లక్షలు ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రకటన పత్రికలకే పరిమితమయిందని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి 2.25 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తుండగా క్రమంగా తగ్గిస్తూ పోతున్నారని విమర్శించారు. వ్యవసాయం, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ ను పున:పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. లేని యెడల దేశ వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మనాయక్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, ఆంజనేయులు, చెన్నయ్య పాల్గొన్నారు.

Next Story

Most Viewed