జీహెచ్ఎంసీలో మొదలైన బతుకమ్మ సంబరాలు..

by Disha Web Desk 13 |
జీహెచ్ఎంసీలో మొదలైన బతుకమ్మ సంబరాలు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబురాలు ఆదివారం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి . తంగేడు, జిల్లేడు, బంతి, చామంతి ఇలా తీరొక్క పూలతో మహిళలు పేర్చిన బతుకమ్మలు ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకున్నాయి. బస్తీలలో రంగు రంగుల పూలతో లోగిళ్లు పూల వనాలుగా మారి ఉయ్యాల పాటలతో మార్మోగాయి. ఆత్మీయతకు అనుబంధానికి అద్దం పట్టేలా మహిళలందరూ బతుకమ్మలతో ఓ చోట చేరి ఆటపాటలతో సందడి చేయడంతో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో గౌరమ్మను పూజించిన మహిళలు చివరి రోజు సద్దుల బతుకమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది . నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

నగర వ్యాప్తంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో , బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు, యువతులు ఎంతో ఉత్సహంగా పాటలు పాడి భక్తితో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలతో నగరంలోని కాలనీలలో సందడి నెలకొననుంది. వాడవాడలా ఓ చోట చేరిన అతివలు తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొంటారు.

ప్రకృతిని పూజించే పండుగ..

తెలంగాణలో ప్రకృతిని ఆరాధించే అతి పెద్ద పూల పండుగ బతుకమ్మ. పూలు బాగా పూసే కాలంలో, నీరు సమృద్ధిగా పారే సమయంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి తో మనిషికి ఉన్న అనుబంధం సంబరంగా ఆశ్వీయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తొమ్మిది రోజులూ ఆడపడుచులు తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చి, అందులో "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ)ను ప్రతిష్టించి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ.. లయబద్ధంగా చప్పట్లు కొడుతూ.. వలయంగా తిరుగుతూ.. బతుకమ్మ పాటలు పాడతారు. ఏ రోజుకారోజు నిమజ్జనం చేస్తారు. ప్రతీరోజుకూ ఓ ప్రత్యేకత ఉంటుంది.


Next Story

Most Viewed