- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్టీ రిజర్వేషన్ల అమలు ఎలా.. ఆగిపోయిన ఉద్యోగాల భర్తీ
ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు జీవో కూడా జారీ అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు జీవో కూడా జారీ అయింది. కానీ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఇప్పటి వరకు రిజర్వేషన్లు పెంచినా, సవరించిన మార్గదర్శకాలను విడుదల అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రకటించగానే.. కేంద్రం నుంచి జీవో జారీ అయింది. వాటిని అనుసరిస్తూ రాష్ట్రాలు మార్గదర్శకాలు జారీ చేశాయి.
ఈ మార్గదర్శకాలతోనే రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకు రాని వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అర్హులని, ఈ పరిధికి వచ్చే వారి కుటుంబ స్థూల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలని, తదితర నిబంధనలు, విషయాలను మార్గదర్శకాల్లో వివరించారు. కానీ ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతున్నట్టు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్గదర్శకాలను మాత్రం విడుదల చేయలేదు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 54 (ఈడబ్ల్యూఎస్ మినహాయించి) శాతానికి చేరుతున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏ విధంగా ఎదుర్కోనున్నది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచుతూ 2012లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీల రిజర్వేషన్లను 8 నుంచి 12 శాతానికి, ఎస్టీల కోటా 20 నుంచి 32 శాతానికి పెంచింది. దీంతో, ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ గత నెల 27న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు రిజర్వేషన్ల పెంపు ఉత్తర్వులు కొట్టివేసింది. పరిమితిని మించి రిజర్వేషన్లు పెంచడానికి తగిన ఆధారాలు చూపించలేదని తప్పుబట్టింది. తెలంగాణలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రేక్.. బ్రేక్..
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కారణంగా కొత్తగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఆగిపోయాయి. పలు విభాగాల్లో ప్రమోషన్స్ కూడా నిలిచిపోయాయి. ఆర్థిక శాఖ అనుమతి లభించి.. నోటిఫికేషన్ వెలువడిన పోస్టులు 36 వేలు ఉన్నాయి. రిజర్వేషన్ల పెంపుతో నోటిఫికేషన్లను మళ్లీ సవరించాల్సిన అవసరం ఉంది. కానీ, మార్గదర్శకాలు రాకపోవడంతో సవరణ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు ప్రాథమికంగా రిపోర్టు సిద్ధం చేసినా.. సీఎం నుంచి రిప్లై రాకపోవడంతో అది పక్కన పడింది.






