రేస్ ఫర్ ఛేంజ్.. వైద్యారోగ్య రంగంలో మార్పులకు శ్రీకారం

by Dishanational2 |
రేస్ ఫర్ ఛేంజ్.. వైద్యారోగ్య రంగంలో మార్పులకు శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పెరుగుతున్న జనాభా, వారి వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లను తీర్చిదిద్దడంపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి తీసుకున్న చొరవకు కేంద్రం నుంచి సహకారం లేదనే ఆరోపణలు ఎలా ఉన్నా రానున్న విద్యా సంవత్సరం నుంచే పన్నెండు కొత్త మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. వైద్యారోగ్య మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస రివ్యూలతో సిబ్బందిలో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఆయా స్థాయిల్లో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా చర్యలు మొదలయ్యాయి. గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టడం మంత్రిగా హరీశ్‌రావుకు సవాలుగా మారింది. సమస్యలు కొన్ని ఉన్నా.. పొలిటికల్ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌‌రావు వైద్యారోగ్య మంత్రిగా కూడా తన ముద్రను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

బస్తీ దవాఖానలు

మంచి పథకం ఎక్కడ అమలవుతున్నా దాన్ని స్వీకరించడానికి బేషజాలు అవసరం లేదని తరచూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే వ్యాఖ్యలకు అనుగుణంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న మొహల్లా క్లినిక్‌ల స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో రూ. 95 కోట్ల ఖర్చుతో 320కు పైగా బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. రెండు కోట్ల మందికిపైగా సేవలందించినట్లు ప్రభుత్వ వాదన. మరో 50 త్వరలో అందుబాటులోకి రానున్నట్లు మంత్రి ప్రకటించారు. వీటి ద్వారా వచ్చిన ఫలితాలతో దశలవారీగా మొత్తం 2000 పల్లె దవాఖానాలు కూడా వినియోగంలోకి వచ్చేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. అవసరాలే ప్రాతిపదికగా రూ. 700 కోట్లతో 43 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. వారికి ప్రత్యేకంగా ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఇస్తున్నది.

నిరంతర రివ్యూలతో అలర్ట్

కరోనా తదనంతర పరిస్థితుల్లో వైద్యారోగ్య మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్పు మొదలైంది. సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ‘ప్రతివారం రివ్యూ’ విధానాన్ని తీసుకురావడంతో పనితీరుపై నివేదిక తయారీ తప్పనిసరిగా మారింది. మంత్రి ఏ టైమ్‌లో రివ్యూ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే భయంతో అన్ని స్థాయిల్లోని స్టాఫ్ అలర్ట్ గా పనిచేసే వాతావరణం నెలకొన్నది.

పెరిగిన నార్మల్ డెలివరీలు

కడుపు కోతల్లేకుండా చూడాలని డాక్టర్లకు చేసిన సూచనలు ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మొత్తం 33 జిల్లాల్లో 16 చోట్ల 70 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయి. మెదక్, సంగారెడ్డి, నారాయణపేట్, గద్వాల జిల్లాల్లో ఇది 80 శాతానికి పైగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రం మొత్తం మీద సగటున 50% డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నట్లు తేలింది. సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించడానికి కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ వైద్యశాలల్లో వీలైనంతవరకు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక్కో ప్రసవానికి రూ. 3,000 ఇన్సెంటివ్ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. ఇది సత్ఫలితాలను ఇస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఇందుకోసం గర్భం దాల్చినప్పటి నుంచి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అవగాహన కలిగించే ప్రక్రియ మొదలైంది.

వినూత్నంగా స్కీమ్‌లు

వైద్యం కోసం అవుతున్న ఖర్చును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్స్ పేరుతో ఉచితంగా మెడికల్ టెస్టులు చేసే లాబ్‌లను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 సెంటర్లతో 60 రకాల ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేయించుకునే వెసులుబాటు కల్పించింది. అల్ట్రాసౌండ్ స్కాన్ సహా 2-డీ ఎకో, మామ్మోగ్రఫీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి ఆధునిక వైద్య పరీక్షలకు కంట్రోల్ సెంటర్‌ను నెలకొల్పింది. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ. 228 కోట్లను ఖర్చు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. సుమారు కోటిన్నర మంది ఇప్పటివరకు సేవలందుకున్నారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి

రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరుకున్నది. త్వరలోనే ప్రతీ జిల్లా కేంద్రంలో ఒకటి నెలకొల్పాలన్నది సర్కారు టాస్క్. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 780 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉంటే తొమ్మిదేళ్ల కాలంలో మరో 17 కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం 26 కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,815కు చేరుకున్నది. ప్రైవేటు కళాశాలలతో కలుపుకుంటే సీట్ల సంఖ్య 4,440కు చేరినట్లయింది. పోస్టు గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య కూడా కేవలం ప్రభుత్వ వైద్య కళాశాల్లో 515 నుంచి 1,216కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీస్‌ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌ సీట్ల పెరుగుదల దేశంలో 71శాతంగా ఉంటే, తెలంగాణలో 124శాతంగా ఉన్నది. పీజీ సీట్ల పెరుగుదల జాతీయ సగటు 68శాతం ఉంటే, తెలంగాణ 111శాతం నమోదు చేసింది. గతేడాది నుంచి బీ కేటగిరీలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించింది. దీంతో ర్రాష్టంలోని 24 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 1,071 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించాయి. ఫలితంగా 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చింది.

రాష్ట్రం.. కేంద్రం ఫైట్​

దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కళాశాలలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా లేదనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. సకాలంలో ప్రతిపాదనలు పంపించి ఉంటే మంజూరయ్యేవనేది కేంద్ర ప్రభుత్వ వాదన. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకుని తొలుత సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను నెలకొల్పింది. ఆ తర్వాత రెండేండ్ల క్రితం వనపర్తి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, కొత్తగూడెం, జగిత్యాల, రామగుండం జిల్లాల్లో నెలకొల్పింది. ఇటీవల నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో నెలకొల్పింది.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం

కరోనా సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పేరుతో స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పన రాష్ట్ర ప్రభుత్వం దాని వెలుగులో నగరానికి నాలుగు దిక్కులా మరో నాలుగు ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎర్రగడ్డ, గడ్డిఅన్నారం, అల్వాల్ ప్రాంతాల్లో మూడింటికి ముఖ్యమంత్రి గతేడాది శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 2,700 కోట్ల ఖర్చుతో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ సహా మొత్తం 50 డిపార్టుమెంటులకు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నది ప్రభుత్వ వాదన. మరోవైపు వరంగల్ నగరంలో బహుళ అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పి నగరాన్ని హెల్త్ సిటీగా మార్చే ఆలోచన చేస్తున్నది.

డాక్టర్ల, నర్సుల రిక్రూట్‌మెంట్

ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ప్రస్తుతం పనిచేస్తున్న ఆస్పత్రుల్లో బెడ్‌ల సంఖ్యను పెంచడంతో పాటు కొత్తగా మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఆస్పత్రులు, నర్సింగ్ కాలేజీలను సైతం ప్రభుత్వం నెలకొల్పుతున్నది. ఆస్పత్రుల స్థాయికి తగినట్లుగా డాక్టర్లను, నర్సులను రిక్రూట్‌మెంట్ చేసుకునే చర్యలతో పాటు భవిష్యత్తులో వారిని ఆ ప్రొఫెషన్‌లోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నిమ్స్ విస్తరణ

నిజాం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నిమ్స్ (నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రి ఆధునికీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని సేకరించిన ప్రభుత్వం దశాబ్ది వేడుకల సందర్భంగా కొత్త భవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. నిమ్స్ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రూ. 1,517 కోట్ల ఖర్చుతో ఎర్రమంజిల్ ప్రాంతంలో రెండు వేల బెడ్‌లతో కొత్త బ్లాక్ అందుబాటులోకి రానున్నది. మొత్తం 42 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు వినియోగంలోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొన్నది. పలు విభాగాల్లో కొత్త కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో నిమ్స్ ఆస్పత్రి బెడ్ స్ట్రెంత్ 3,800కు పెరగనున్నది.

కొత్త పీహెచ్‌సీలు

గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించే పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 43 కొత్త పీహెచ్‌సీ భవనాలను నిర్మిస్తున్నది. ఇందుకు రూ.67 కోట్లు ఖర్చు చేస్తున్నది. దీంతోపాటు రూ.43 కోట్లతో 372 పీహెచ్‌సీల మరమ్మతులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1239 సబ్‌ సెంటర్లకు భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున ఏకంగా రూ.247 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. అదనంగా 1497 సబ్‌ సెంటర్ల భవనాలను రూ.60 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నది. కొత్తగా ఏర్పడిన 40 మండలాలకు పీహెచ్‌సీలు మంజూరు చేస్తూ ఇటీవలే క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రికార్డు సమయంలో ఏకంగా 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లను నియమించింది. మానసిక సమస్యలకు పరిష్కారం చూపేలా 24 గంటల పాటు మానసిక వైద్యులు అందుబాటులో ఉండే, టెలీ మానస్‌ 14416 కాల్‌ సెంటర్‌ గతేడాది అక్టోబర్లో ప్రారంభించగా,1027 మంది సేవలు పొందారు.

రెండున్నర రెట్లు పెరిగిన బడ్జెట్‌

స్వరాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులు ఏటికేడు పెరుగుతున్నాయి. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. 2023-24 నాటికి రూ.12364 కోట్లకు పెరిగింది. అంటే తొమ్మిదేండ్లలో హెల్త్‌ బడ్జెట్‌ రెండున్నర రెట్లు పెరిగింది. తలసరి వైద్య బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తలసరి కేటాయింపులు రూ.3,225గా నమోదైంది. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి కేటాయింపులు రూ.925 మాత్రమే.

సర్కారు ముందు సవాళ్లు

గతంలో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ట్విన్ టవర్లను కట్టనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అది ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ బకాయిలు సకాలంలో విడుదల కావడంలేదన్నది ప్రైవేటు ఆస్పత్రుల ఆరోపణ. ఎంప్లాయీస్, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ సైతం ఆశించిన స్థాయిలో అమలుకావడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సిబ్బంది నుంచి సహకారం, వైద్య సేవలు అనుకున్నంతగా పెరగలేదు. మాతా, శిశు మరణాలు తగ్గినా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు పెరిగినా, కేసీఆర్ కిట్ తరహాలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతున్నా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సంతృప్తికరమైన మెడికల్ కేర్ అందడం లేదనే ఆరోపణలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మంత్రులు లేదా ఉన్నతాధికారుల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు ఉన్నవారికే బెటర్ సర్వీసెస్ అందుతున్నాయనేది పబ్లిక్‌లో ఉన్న జనరల్ టాక్.

వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు

ప్రభుత్వం నుంచి సకాలంలో ఆర్థిక వనరులు సమకూరకపోవడంతో వైద్య రంగంలో ఫలితాలు వేగంగా రావడంలేదు. ఈ కారణంగానే గతేడాది ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినా ఇప్పటికీ సిటీలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఊపందుకోలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వెంటాడుతున్నది. ఆధునిక పరికరాల కొనుగోలుకూ డబ్బుల సమస్య ఆటంకంగా మారింది. కొత్త ఆస్పత్రులకు సుమారు రూ. 2,700 కోట్లను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ పేరుతో రుణాలు తీసుకోవడమే ఏకైక మార్గమైంది. కంటివెలుగు స్కీమ్‌ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్, కళ్లద్దాలను ఇవ్వడానికి రూ. 200 కోట్లను ఖర్చు చేసినా, ఇతర రాష్ట్రాలు ప్రశంసించినా, దీనికి రాజకీయ కోణం ఉందనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Next Story

Most Viewed