HYD: అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వస్తే అంతే సంగతి!

by Disha Web Desk 2 |
HYD: అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వస్తే అంతే సంగతి!
X

దిశ, సిటీబ్యూరో: గణనాథుడి నిమజ్జనం కారణంగా నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు శోభాయాత్ర జరిగే బాలాపూర్ టూ ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్డులో, ఈ రోడ్డుకు లింకై ఉన్న సబ్ రోడ్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర పోలీసుశాఖ తెలిపింది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టున్న అన్ని రోడ్లలో నిమజ్జనం కోసం వచ్చే మండపాలున్న వాహనాలనే అనుమతించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు ఖైరతాబాద్ గణపయ్య శోభాయాత్ర జరిగే ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా ఈ ఆంక్షలను అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఎక్కడికక్కడే బ్యారికేడ్లను ఏర్పాటు చేసిన వాహన రాకపోకలను నియంత్రించనున్నట్లు పోలీసుశాఖ పేర్కొంది.

సౌత్ జోన్..

సౌత్ జోన్‌లోని కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మహాబూబ్ నగర్ క్రాస్ రోడ్డు, చంచల్‌గూడ జైలు క్రాస్ రోడ్డు ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయనున్నారు. ముఖ్యంగా ఇంజన్ బౌలీ, శంషీర్ గంజ్, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలీ, ఆస్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటే, పంచ్ మహాలా, ప్యారీస్ కేఫ్, గుల్జాల్ హౌజ్, మిట్టీకా షేర్, కాళీకమాన్, ఉస్మాన్ బజార్, షెరన్ హోటల్, మదీనా క్రాస్ రోడ్డు, నయాపూల్, ఎస్‌జే రోటరీ, అర్మాన్ హోటల్, ఎంజె బ్రిడ్జి, దారుల్ షిఫా క్రాస్ రోడ్డు, సిటీ కాలేజీ, మూసాబౌలీ, ముర్గీచౌక్, మోతీగల్లీ ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈస్ట్ జోన్..

ఈస్ట్ జోన్‌లోని శివాజీ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లీబౌలీ క్రాస్ రోడ్, త్రూప్ బజార్, జాంబాగ్ క్రాస్ రోడ్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్‌లలో బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు.

సౌత్ వెస్ట్ జోన్..

ముస్లింజంగ్ బ్రిడ్జి, పురానాపూల్, తోప్ ఖానా మసీదు, ఫీల్ ఖానా, అలస్కా హోటల్ జంక్షన్, దారుస్సలాం, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, అజంతా గేట్ ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను దారిమళ్లించనున్నట్లు తెలిపారు.

సెంట్రల్ జోన్..

సెంట్రల్ జోన్‌లోని చాపెల్ రోడ్ ఎంట్రీ, గద్వాల్ సెంటర్, జీపీఓ, శాలిమార్ ధియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్డు, దోమల్ గూడలోని భారత్ స్కౌట్, గైడ్స్ జంక్షన్, కంట్రోల్ రూమ్ ముందున్న కళాంజలి, చాపెర్ రోడ్డు, ఏఆర్ పెట్రోల్ పంపు, కేఎల్‌కే భవన్, లిబర్టీ జంక్షన్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, జీహెచ్ఎంసీ ఆఫీసు జంక్షన్, బీఆర్కేఆర్ భవన్ జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్, చిల్డ్రన్స్ పార్క్, మారియేట్ హోటల్, లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఇందిరాపార్కు జంక్షన్‌లలో వాహనాలను మళ్లీంచనున్నట్లు పోలీసులు తెలిపారు.

నార్త్ జోన్..

పీవీఎన్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్, కర్బాలా మైదానం, బుద్దభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్‌ల మీదుగా ఉదయం 6గంటల నుంచి 29వ తేదీ ఉదయం 10గంటల వరకు ట్రాఫిక్‌ను అనుమతించబోమని తెలిపారు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ క్రాస్ రోడ్డు, ప్యాట్నీ క్రాస్ రోడ్, బాటా క్రాస్ రోడ్డు, అడవయ్య క్రాస్ రోడ్, ఘన్స్ మండీ క్రాస్ రోడ్‌లలో బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు.

పార్కింగ్ ప్లేసెస్..

హుస్సేన్ సాగర్‌లో జరిగే నిమజ్జనం కోసం వచ్చే భక్తులు, సందర్శకులు తమ వాహనాలను ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఆఫీసు, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, లోయర్ ట్యాంక్ బండ్‌లోని గోశాల, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్‌లలో పార్కింగ్ చేసుకోవచ్చునని పోలీసులు తెలిపారు.

నిమజ్జనం ముగిసిన తర్వాత వెళ్లేదారులివే..

గణేష్ మండపాలతో వచ్చే వాహనాలు నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ జంక్షన్ మీదుగా వెళ్లవచ్చు. పీవీఎన్ మార్గ్‌లో నిమజ్జనం పూర్తయిన వాహనాలు నెక్లెస్ రోడ్ రోటరీ, నుంచి కుడివైపు తీసుకుని ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ జంక్షన్‌కు వెళ్లవచ్చు. చిల్డ్రన్ పార్క్ వద్ద నిమజ్జనం పూర్తి చేసుకున్న వాహనాలు లోయర్ ట్యాంక్ బండ్‌లోని గోశాల, బండమైసమ్మ, ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపులు..

మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసాబ్ ట్యాంక్ చౌరస్తా వద్ద మళ్లించనున్నారు. అలాగే కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులను వీవీ విగ్రహం వద్ద, సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులను సీటీఓ ప్లాజా, ఉప్పల్ నుంచి వచ్చే బస్సులను రామంతాపూర్ టీవీ స్టూడియో వద్ద, దిల్‌సుఖ్‌నగర్ నుంచి బస్సులను చాదర్‌ఘాట్ వద్ద, రాజేంద్రనగర్ నుంచి వచ్చే బస్సులను దానమ్మ హట్స్ వద్ద, ఇబ్రహీంపట్నం, మిథానీ నుంచి వచ్చే బస్సులను ఐఎస్ సదన్ వద్ద, ఇంటర్ సిటీ స్పెషల్ బస్సులను వైఎంసీఏ వద్ద, తార్నాక నుంచి జామియా ఉస్మానియా ఫ్లై ఓవర్ పైకి వెళ్లకుండా బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించనున్నారు.



Next Story