Harish Rao: మేమూ ప్రిపేర్ అవ్వాలి కదా.. ముందే సమాచారం ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి?

by Gantepaka Srikanth |

యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకుల పిల్లల మరణాలు సహా ఇతర ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వకుండా రెండు రోజులే నడుపుతామని ప్రభుత్వం చెప్పడంతో BAC నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.

Harish Rao: మేమూ ప్రిపేర్ అవ్వాలి కదా.. ముందే సమాచారం ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకుల పిల్లల మరణాలు సహా ఇతర ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వకుండా రెండు రోజులే నడుపుతామని ప్రభుత్వం చెప్పడంతో BAC నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు(Harish Rao) మాట్లాడారు. 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని బీఏసీ సమావేశంలో కోరినట్లు చెప్పారు. చాలా గ్రామాల్లో కరెంటు, రోడ్లు లేవు. ప్రాణాలు కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొదటి ప్రాధాన్యత కింద రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టంపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ కోరిందని అన్నారు.

రెండో ప్రధానమైన సమస్య యూరియా కొరత :

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. యూరియా కొరతకు కారణం బీజేపీ, కాంగ్రెస్ అన్నదానిపై చర్చిద్దామని కోరాం. ఎరువుల కొరత తీర్చేందుకు అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేక మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంటురోగాలపై చర్చించాలని, గురుకులాల్లో 100కు పైగా మరణాలు జరిగాయి. వాటిపై చర్చించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పై చర్చించాలని కోరినట్లు చెప్పారు.

ఫోర్త్ సిటీలో ముఖ్యమంత్రి సోదరులపై వస్తున్న అరాచకాలపై, ఉద్యోగుల పీఆర్సీడీఎల్ఐ గురించి, బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించాలని కోరాము. రెండే రోజులు అసెంబ్లీ నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. రెండు రోజుల్లో ఇన్ని సమస్యలపై ఎలా చర్చిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా సభ వాయిదా వేసుకుని పారిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాల గురించి చర్చిద్దాం అంటే బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడడానికి ముందుకు రాకపోవడంతో బీఎస్సీ సమావేశం నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చామని అన్నారు. వరదలపై, యూరియా కొరతపై మాట్లాడటం కంటే ప్రభుత్వానికి ఇంకేమి ప్రాధాన్యత ఉంటుంది? అని అడిగారు.

ప్రభుత్వ ధోరణి చూస్తుంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పెట్టి బురద రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నట్టు ఉంది. ఒక్కరోజు కాదు నాలుగు రోజులైనా సరే కాళేశ్వరం కమిషన్‌పై మాట్లాడదాం అని సవాల్ చేశారు. కానీ ముందు ప్రజలు కష్టాల గురించి చర్చిద్దామని కోరారు. రేపు సభలో ఏం చర్చిస్తారో రాత్రి 9 తర్వాత తెలుపుతామని సమాధానం ఇచ్చారు. రేపు అసెంబ్లీలో పెట్టే చర్చ గురించి సమాచారం ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఎలా ప్రిపేర్ అవుతాయని సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. ప్రజాపాలన మాదంటూ రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ ఏమని సమాధానం చెబుతారని అడిగారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేశారు.

Next Story