ఎంపీ బరిలో రాష్ట్ర గవర్నర్! మనసులో మాట బయటపెట్టిన తమిళిసై

by Disha Web Desk 13 |
ఎంపీ బరిలో రాష్ట్ర గవర్నర్! మనసులో మాట బయటపెట్టిన తమిళిసై
X

దిశ, డైనమిక్ బ్యూరో:గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నారా? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేలా ప్లాన్ రెడీ చేసుకున్నారా? తాజాగా తమిళిసై చేసిన వ్యాఖ్యలు అవుననేలా సమాధానం ఇస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ విధులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళిసై.. పుదుచ్చెరి ఎల్జీగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళిసై నిన్న విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉండాలనే ఆశ తనకు ఉందని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై నర్మగర్భంగా మాట్లాడిన ఆమె.. ఈ విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షా లతే తుది నిర్ణయం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో నిజంగానే తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నారా అనే జరిగితే మరి తెలంగాణకు కొత్త గవర్నర్ రాక తప్పదనే చర్చ మరోసారి జోరందుకుంది.

మారిన పరిస్థితులలో మళ్లీ బ్యాక్:

2019 లో తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడిన విధాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు హాట్ డిస్కషన్ కు తావిచ్చాయి. గతంలో తమిళనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై బీజేపీ ఏజెంట్ లా పని చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించారు. గతంలో2009 లో నార్త్ చెన్నై నుంచి 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయినా ఆమె రాజకీయ అనుభవం దృష్ట్యా అధిష్టానం గవర్నర్ గా అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు అధిష్టానం ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఆపరేషన్ సౌత్ ఇండియాపై నజర్ వేసింది. దక్షిణ భారత దేశంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇదే సమయంలో తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న తమిళిసై తాజాగా తన మనసులోని మాటను వెల్లడిస్తూనే ఈ విషయంలో తుది నిర్ణయం మోడీ, అమిత్ షాలదే అని తేల్చేసింది. దీంతో అన్ని సజావుగా జరిగితే గతంలో పోటీ చేసిన తూత్తుకుడి నుంచి లేదా పుదుచ్చేరి బరిలో తమిళిసై ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రానికి కొత్త గవర్నర్!:

తమిళిసై సౌందర రాజన్ ఒక వేళ పోటీ చేయడానికి బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే తెలంగాణకు కొత్త గవర్నర్ రాక తప్పని పరిస్థితి. దీంతో రాబోయే ఆ కొత్త గవర్నర్ ఎవరూ అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నుడుస్తోంది. ఈసారి బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతుందని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే ఆమె స్థానాన్ని భర్తీ చేయబోయో కొత్త గవర్నర్ ఎవరూ అనేది ఉత్కంఠ రేపుతున్నది.



Next Story

Most Viewed