వరుస పేపర్ లీక్‌లపై సర్కారు సీరియస్.. రంగంలోకి CS శాంతికుమారి

by Disha Web Desk 19 |
వరుస పేపర్ లీక్‌లపై సర్కారు సీరియస్.. రంగంలోకి CS శాంతికుమారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరుసగా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుండడంపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. పదో తరగతి పరీక్షల్లో తొలి రోజున ప్రశ్నాపత్రం లీక్ కావడంపై పూర్తి స్థాయిలో ఆరా తీసిన విద్యాశాఖ సహా పలు శాఖల అధికారులు దాన్ని చక్కదిద్దే లోపే రెండో రోజున కూడా వరంగల్ జిల్లాలో పరీక్ష జరుగుతున్న సమయానికే హిందీ పేపర్ లీక్ కావడం మరింత అసహనానికి దారితీసింది. దీనిపై ఆరా తీసిన ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అందుబాటులో ఉన్న విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి వాస్తవిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షలు మరో పది రోజుల పాటు జరగనున్నందున ఇకపైన జరిగే పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా, ఏ ప్రశ్నాపత్రం లీక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బీఆర్‌కేఆర్ భవన్‌లో మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు.

ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్నాపత్రాలు సిబ్బంది ద్వారా లీక్ అయినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. పదో తరగతి పరీక్షలు కూడా ఉపాధ్యాయుల ద్వారానే బైటకు లీక్ కావడంతో శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ స్పష్టమై మార్గనిర్దేశనం చేయనున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు మాత్రమే మొబైల్ ఫోన్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్ళడంపై ఆంక్షలు ఉన్నాయి. ఇకపైన ఇన్విజిలేటర్లు, విద్యాశాఖ సిబ్బంది సైతం వెంట తీసుకుని వెళ్ళకుండా పకడ్బందీగా వ్యవహరించడంపై ఆమె సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నది. పదో తరగతి పరీక్షల మొదటి రోజున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలుగు పేపర్ లీక్ కాగా రెండో రోజున ఉమ్మడి వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది.

ఇకపైన ఏ జిల్లాలోనూ ఇలాంటి లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా విద్యాశాఖ, రెవెన్యూ శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఉట్నూరులో విద్యార్థుల జవాబు పత్రాలు మాయం అయినట్లు వచ్చిన వార్తలపైన కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటి అంశాలన్నింటిపై కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను ఆమె జారీ చేయనున్నట్లు తెలిసింది. సమావేశం తర్వాత స్పష్టమైన అంశాలు వెలుగులోకి రానున్నాయి.



Next Story

Most Viewed