హరీష్ రావును ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ మంత్రుల్లో లేదు.. BRS నేత కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
హరీష్ రావును ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ మంత్రుల్లో లేదు.. BRS నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావును ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ మంత్రుల్లో లేదని విమర్శించారు. ఆయన్ను ఒక్కడికి ఎదుర్కొనేందుకు ఆరుగురు మంత్రులు అటాక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. నేటి వరకు కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లేందుకే కేటాయించారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కావనే విషయం వారికి తెలుసని అన్నారు. ఆ విషయం బడ్జెట్ కేటాయింపులు చూస్తే తెలిసిపోతుందని వెల్లడించారు. హామీలకు.. కేటాయించిన బడ్జెట్‌కు ఏమాత్రం పొంతన లేదని ఎద్దేవా చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే.. కనీసం వదరోజులైనా ఆగండి అంటున్నారని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని గుర్తుచేశారు. కర్ణాకటలో కూడా చేతులెత్తేసి కాలం వెల్లదీస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీల అమలుపై బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 72 రోజులు అయిందని.. ఈ రెండున్నర నెలల్లో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వచ్చాక ఇంకా సమస్యలు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు వచ్చాయని తెలిపారు. రెండు నెలల్లోనే రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేసే స్థితికి వచ్చారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందుకు తెస్తున్నారని అన్నారు. ప్రజలు తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది కాంగ్రెస్‌ను ప్రశ్నించడానికే అని అన్నారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తామని తెలిపారు. ఆలేరులోని వైద్య కళాశాలను కొడంగల్‌కు మార్చొద్దని చెప్పారు.



Next Story

Most Viewed