డీజీపీ ఆఫీస్​లో ఫైర్ ​మాక్​ డ్రిల్​

by Dishafeatures2 |
డీజీపీ ఆఫీస్​లో ఫైర్ ​మాక్​ డ్రిల్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డీజీపీ కార్యాలయం ప్రశాంతంగా ఉంది. అధికారులు, సిబ్బంది ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫైర్​ అలారం మోగింది. పరుగున బయటకు వచ్చిన సిబ్బందిలో కొందరు అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలు వ్యాపించకుండా రంగంలోకి దిగితే మరికొందరు మిగిలిన ఉద్యోగులను సురక్షితంగా బయటకు పంపించారు. డీజీపీ ఆఫీస్​లో బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై జరిపిన మాక్ ​డ్రిల్​లోని సన్నివేశాలివి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా స్పందించాలి? అన్న అంశంపై డీజీపీ అంజనీకుమార్​ పర్యవేక్షణలో అగ్నిమాపక నిరోధక శాఖ సిబ్బంది మాక్​డ్రిల్​ నిర్వహించారు.

ఐజీ రమేశ్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రిల్​లో మంటలు ఎగిసిపడితే వాటిని ఎలా ఆర్పాలి? అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలి? సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి పాత్ర పోషించాలి? ఉద్యోగులను సురక్షితంగా బయటకు ఎలా పంపించాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినపుడు ఏయే వస్తువులను ఉపయోగించకూడదో తెలియచేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక నిరోధక శాఖ అదనపు డైరెక్టర్​ జీ.వీ.నారాయణరావు, డీఎఫ్ఓ శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed