ఇంద్రవెల్లి అమరుల స్థూపం విస్తరణ.. ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు

by Disha Web Desk 4 |
ఇంద్రవెల్లి అమరుల స్థూపం విస్తరణ.. ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరుల స్థూపం అభివృద్ధి, సుందరీకరణ కోసం సీసీఎల్ఏ (భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్) ప్రతిపాదనల మేరకు ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న స్థూపాన్ని సుందరీకరి స్మృతివనాన్ని అభివృద్ధి చేయడానికి సర్వే నెం. 240లో ఉన్న ఎకరం మేర స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీచేశారు.

అక్కంపేట గ్రామానికి రెవెన్యూ గుర్తింపు

ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ విలేజ్‌గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న అక్కంపేట గ్రామం ప్రస్తుతం పెద్దాపూర్ గ్రామ పరిధిలో ఉన్నదని, దీన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ రెవెన్యూ విలేజ్‌గా గుర్తించలేదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఇక నుంచి పెద్దాపూర్ గ్రామం నుంచి అక్కంపేటను విడదీసి రెవెన్యూ గ్రామంగానే గుర్తించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ గ్రామ, మండల, డివిజన్, జిల్లా ప్రజలకు ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే పదిహేను రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా తెలియజేయాలని పేర్కొన్నారు. ఆ తర్వాత అక్కంపేట గ్రామాన్ని లాంఛనంగా రెవెన్యూ గ్రామంగా ప్రభుత్వం గుర్తించనున్నది.

తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిపిన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర, వెనకబాటుతనంపై గణాంకాలతో సహా ప్రజలకు వివరించడంతో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందే ఆయన చనిపోవడాన్ని ప్రజలు పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ విలేజ్‌గా గుర్తించాలని తీసుకోనున్న నిర్ణయం సెంటిమెంట్‌గా మారనున్నది. ఇదే సమయంలో ఇంద్రవెల్లి అమరుల స్థూపం విస్తరణ, సుందరీకరణ, స్మృతివనం అభివృద్ధి విషయంలోనూ ఉద్యమకారులే కాక ప్రజల్లోనూ పాజిటివ్ మెసేజ్ వెళ్ళనున్నది.



Next Story