స‌ర్వం క‌ల్తీమయం! అధికారుల తనిఖీలు శూన్యం

by Disha Web Desk 4 |
స‌ర్వం క‌ల్తీమయం! అధికారుల తనిఖీలు శూన్యం
X

వరంగల్ ​కేంద్రంగా కల్తీదందా జోరుగా సాగుతోంది. ఆహారపదార్థాల కల్తీలో ఓరుగల్లు అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసర వస్తువులతో పాటు చంటిపిల్లలు తాగే పాలను సైతం విషతుల్యం చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కల్తీ కేటుగాళ్లు దందా చేపడుతున్నారు. నాణ్యతాప్రమాణాలను గాలికొదిలి నిత్యవసరాలను తయారు చేస్తున్నారు. ఊరు, పేరు, ప్యాకింగ్, గడవు తేదీ లేకుండానే విక్రయిస్తున్నారు. బియ్యం, పాలు, ఉప్పు, పప్పు, కారం, నూనె, నెయ్యి చివరకు అల్లం పేస్ట్​ను సైతం కల్తీ చేస్తున్నారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన తోపుడు బండ్లపై విక్రయించే ఆహారపదార్థలన్నీ నాసీరకమైన వస్తువులతోనే తయారు చేస్తున్నారు. అధికారుల తనిఖీలు కొరవడడంతో వ్యాపారులు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. కంటికి ఇంపుగా కనిపించేలా ఆహారపదార్థాలు తయారుచేసి వేడివేడిగా వడ్డిస్తున్నారు. కల్తీ నేపథ్యంలో అనేకమంది ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్‌, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప‌ట్టింపులేన‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తున్నట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

దిశ, హన్మకొండ టౌన్ : వ‌రంగ‌ల్ త్రిన‌గ‌రిలో ఆహార ప‌దార్థాల‌ క‌ల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉప్పు, ప‌ప్పు, కారం, నూనె, నెయ్యి, అల్లంపేస్ట్‌, పాలు, బియ్యం, పిల్లలు ప్యాకేజీ ఫుడ్స్‌లోనూ క‌ల్తీ జ‌రుగుతోంది. డిటర్జంట్‌ పొడి, యూరియా, గంజి కలిపి పాలను కల్తీ చేస్తున్నారు. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతున్నారు. ఐస్‌క్రీంలో వాషింగ్‌ పౌడర్లు, పండ్లపై మైనం పూతగా పూస్తున్నారు. ఉప్పులో సుద్దపొడి, ఎండబెట్టిన బొప్పాయి గింజలు మిరియాలుగా కల్తీ చేస్తున్నారు.

పసుపులో తౌడు, టీపొడిలో రంపపు పొట్టు, కారంపొడిలో ఇటుకల పొడి, గసగసాల్లో గోధుమ రవ్వ, చెక్కరలో బియ్యం రవ్వను కలుపుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలను పాలిథిన్‌ కవర్లలో ప్యాక్‌ చేసి తయారీ, ఎక్స్‌పైరీ తేదీ, బ్యాచ్‌ నంబర్‌ ముద్రించకుండానే మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రజలు వాటిని కొనుగోలు చేసి వ్యాధుల బారిన పడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్‌, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు ప‌ట్టింపులేన‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తున్నట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

హోట‌ళ్లు, బిర్యానీ సెంట‌ర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్లను త‌నిఖీ చేస్తే ఈ విష‌యం ఇట్టే అర్థమ‌వుతుంద‌ని న‌గ‌ర ప్రజ‌లు చెబుతున్నారు. త‌నిఖీల‌కు వెళ్తున్న అధికారులు వ్యాపారులకే వంతపాడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఫిర్యాదులు వచ్చినపుడు తనిఖీలు చేయడం ఆ తర్వాత మౌనం వహించడం పరిపాటిగా మారింది. ప్రశ్నిస్తే శాంపిల్స్‌ సేకరించాం, ప్రయోగశాలకు పంపించామని అధికారులు చెబుతున్నారు. నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని ఒక్క వ్యాపారిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేక పోవ‌డం విశేషం.

2వేల‌కు పైగా హోట‌ళ్లు..

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో 2వేల‌కు పైగా సాధార‌ణ హోట‌ళ్లు ఉండ‌గా, చెప్పుకోదగినవి 100కు పైనే ఉంటాయి. ఇక రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫ్యామిలీ రెస్టారెంట్లు 500లకు పైగానే ఉన్నాయి. మెజార్టీ హోట‌ళ్లలో ఆహార క‌ల్తీ య‌థేచ్ఛగా జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. కల్తీ ఆహార పదారన్థాలతో దుకాణ యజమానులకు కాసులు కురుస్తుండగా వినియోగదారులకు మాత్రం అనారోగ్యమే మిగులుతుంది. ప్రజలు నిన్న మొన్నటి వరకు ఒక పక్క కరోనా, మరోపక్క హార్ట్ స్ట్రోక్ లతో భయం భయంగా బతుకుతుండగా మరోవైపు వర్తకులు వారి స్వలాభం కోసం ఆహార పదార్థాలను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

తెల్ల జొన్నలకు రంగు వేసి అమ్మకం..

హనుమకొండ , వరంగల్ చుట్టుపక్కల పల్లెల్లో జొన్నలు చాలా వరకు రంగు వేసి అమ్ముతున్నారు. తెల్లజొన్నలకు పసుపు పచ్చరంగు వేసి పచ్చ జొన్నలని నమ్మించి మోసం చేస్తున్నారు. తెల్ల జొన్నలకు, పచ్చజొన్నలకు క్వింటాల్ కు రూ.3500 తేడా ఉండడంతో ఈ పని చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రంగు వేసిన జొన్నలతో చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కల్తీ నూనె.. పల్లీ చెక్క..

పట్టణంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులు అధికంగా ఊరూ, పేరు లేని నూనెలు వాడుతున్నారు. బజ్జీల బండి మొదలు టిఫిన్ సెంటర్ల వరకు దాదాపు నూటికి తొంభై మంది వాడే నూనెలు కల్తీవే. కేజీ నూనె రూ.70కే వస్తుండడంతో వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. కల్తీ నూనెలతో అల్సర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టణంలో కొన్ని టిఫిన్ సెంటర్లలో పల్లీచట్నీ రుచి కోసం చట్నీలో గేదెలకు వాడే చెక్కను వాడుతున్నారు. దీంతో జోర్ణకోశ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని, వీలైనంత వరకు బయట ఫుడ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

లైసెన్స్‌ లేకుండానే తయారీ..

ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం 2006ను అనుసరించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నియంత్రణ సంస్థను భారత ప్రభత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్యాకేజీ ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్‌ చేయాలన్నా సంస్థ నుంచి లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార తయారీదారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండానే తయారు చేసి విక్రయిస్తున్నారు. వంట నూనెలు నియంత్రణ చట్టం 1947, నిత్యావసర సరుకుల చట్టం 1955, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992, తదితర చట్టాలు ఉన్నప్పటికీ కల్తీలను అరికట్టలేకపోతున్నారు.

అనారోగ్యాల బారిన ప్రజలు..

ఆహార కల్తీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆహార పదార్థాల్లో హానికరమైన రంగులు, రసాయనాలు వాడడంతో ప్రాణాంతక క్యాన్సర్‌కు కారణమవుతాయి. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాంతకంగా మారుతాయి. కల్తీతో విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయి. మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాల్లో అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడంతో మెదడు, ఎముకలు దెబ్బతింటాయి. కల్తీ ఆహారంతో చర్మంపై దద్దులు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..

- అమృత, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్

ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారి అమృత ను వివరణ కోరగా వరంగల్, హన్మకొండలోని హోటల్స్, హోల్ సేల్ షాపుల్లో తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఫిద్యాదు చేస్తే తనిఖీ చేపడుతామన్నారు. గడువుతీరిన ఆహారపదార్థాలు, కల్తీపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం హన్మకొండ ఫుడ్ ఇన్​స్పెక్టర్ వేణుగోపాల్ కు హన్మకొండతో పాటు జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాకు ఇన్​చార్జి అన్నారు. వరంగల్ ఫుడ్ ఇన్​స్పెక్టర్ సీహెచ్ కృష్ణమూర్తి వరంగల్ తో పాటు సూర్యాపేట జిల్లా కు ఇన్​చార్జి అని తెలిపారు.


Next Story

Most Viewed